KTR
KTR

KTR : మాజీ సీఎం కేసీఆర్‌కు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ ఉందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇన్నాళ్లు విష ప్రచారం చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఆయనే ఇపుడు కేసీఆర్‌కు 67 ఎకరాలు మాత్రమే ఉందని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇన్ని రోజులు వెయ్యి ఎకరాలు అంటూ కేసీఆర్‌పై విష ప్రచారం చేసినందుకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పుట్టినప్పటి నుంచి మా కుటుంబ ఆస్తులెన్నో విచారణకు మేం సిద్ధమని. రేవంత్‌ పుట్టినప్పుడు ఆయన ఆస్తులెన్ని.. ఇప్పుడు ఎన్నో విచారణకు సిద్ధమా? అంటూ కేటీఆర్‌ తీవ్రంగా ప్రశ్నించారు. కేసీఆర్‌కు వ్యవసాయం అంటే మక్కువ. సీఎంగా ఉన్నా ఆయన వ్యవసాయం చేశారు. రేవంత్‌లా భూమిని ఆయన ఆట వస్తువుగా చూడలేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం కేసీఆర్‌ కొనుగోలు చేసిన భూములపై సీఎం బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో రేవంత్‌ సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఆరోపణలు చేసినా 22ఏ బాధితుల పక్షానే నిలబడతామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 22ఏ భూముల వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కేటీఆర్‌ మరోసారి డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్‌ రెడ్డి భూ అక్రమణల వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. గతంలో తాను చెప్పిన మాటలను కూడా వక్రీకరించి అసెంబ్లీలో చెప్పారని అన్నారు. 1000 రోజుల పాలన వైఫల్యాలపై చర్చ జరగకుండా డైవర్షన్ చేసేందుకే కేసీఆర్ కుటుంబ భూముల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని కేటీఆర్ విమర్శించారు. 22A నిషేధిత భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులను చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 30% కమీషన్ల కోసమే 22A అంశాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. లక్షలాది కుటుంబాలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని, తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారని కేటీఆర్‌ వివరించారు. 22A భూముల వ్యవహారంపై బీఆర్‌ఎస్ ఇప్పటికే న్యాయ విచారణ కోరింది. తప్పుగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములను తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని కేటీఆర్ మరోసారి డిమాండ్ చేశారు.

కేసీఆర్ భూములపై అసెంబ్లీలో చెప్పిన వివరాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆయన చెప్పినట్లు మిగిలిన 933 ఎకరాల భూమి ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో చూపించిన భూముల వివరాలే సీఎం చెప్పిన లెక్కల్లో ఉన్నాయని కేటీఆర్ వివరించారు. కేసీఆర్‌పై ఆరోపణలు చేసే ముందు ఆయన ఏం ప్రకటించారో చూడాలని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ సవాల్ చేశారు. తమపై సస్పెన్సన్‌ ఎత్తివేస్తే అసెంబ్లీ వేదికగా అన్ని నిరూపిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలను మరో నెల రోజులు పొడిగించి, భూముల వ్యవహారంపై సమగ్రంగా చర్చించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తప్పు ఎవరిదైనా తేల్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. తొలగించిన భూములు, నిషేధిత జాబితాలో చేర్చిన భూములపైనా విచారణ జరపాలని కేటీఆర్‌ కోరారు.

ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత మాత్రాన ఎవరికీ ప్రత్యేక అధికారాలు రావని కేటీఆర్ స్పష్టం చేశారు. తప్పు చేసేది ప్రభుత్వం అయితే దానికి ప్రజలను బాధ్యులను చేయడం సరికాదన్నారు. ప్రజలు దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇదే అంశంపై బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులకు విద్యుత్ సమస్యలు ఉన్నాయని, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.