
Meenakshi Natarajan : తెలంగాణ ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ కు ఈ మధ్య ఏది కలిసిరావడం లేదు. గతంలో రాజ్యసభకు నామినెట్ కాకుండా అడ్డు పడిన వ్యవహారం మరవకముందే ఈసారి ఆమె లండన్ పర్యటనను అడ్డుకోవాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆమె పాస్‌పోర్ట్ జప్తు చేయాలని పిటిషనర్ కోరడం సంచలనంగా మారింది. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్న తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి, కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ పర్యటన ప్రశ్నార్తకంగా మారింది.
విదేశీ పర్యటనను అడ్డుకోవాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది.కాంగ్రెస్ నేత కంభం శివకుమార్‌రెడ్డి కేసులో బాధితురాలు శ్రీలత పిటిషన్ తాజాగా నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మీనాక్షిపై ఇప్పటికే రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఈ నేపథ్యంలో ఆమె విదేశాలకు వెళ్లకుండా ఆమె పాస్‌పోర్ట్‌ను తక్షణమే జప్తు చేయాలని శ్రీలత కోర్టును కోరడం సంచలనంగా మారింది.మీనాక్షిపై క్రిమినల్ కేసులను పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. కాగా లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పది నెలల కోర్సులో చేరనున్న మీనాక్షి ఈనెల 21న లండన్ వెళ్లనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కానీ, ప్రస్తుత పిటిషన్ తో ఆమె పర్యాటనపై సందిగ్ధం నెలకొంది.
గతంలో రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్
ఇదిలా ఉండగా మీనాక్షి నటరాజన్ గత జూన్‌లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచారు. అమె ఎన్నిక లాంఛనమే అనుకున్న సమయంలో మీనాక్షి నటరాజన్‌కు ఎన్నికల కమిషన్ (ఈసీ) గట్టి షాక్ ఇచ్చింది. ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అఫిడవిట్లో ఆస్తుల వివరాలతో పాటు తనపై ఉన్న కేసుల సమాచారాన్ని సరిగ్గా వెల్లడించలేదని బీజేపీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. నాడు ఆమె నామినేషన్ తిరస్కరణకు గురికావడానికి కారణం తెలంగాణలో నమోదైన కేసు. ప్రస్తుతం అదే కేసులో బాధితురాలు శ్రీలతే ఇప్పుడు మీనాక్షిని విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించడం గమనార్హం. దీంతోఇప్పటికే ఎంపీ పదవి దక్కకుండ పోయినా మీనాక్షికి ఇప్పుడు విదేశీ పర్యటన విషయంలోనూ సమస్య ఎదురు కావడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.









