Telangana : హైదరాబాద్‌లో రోజూ మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ప్రభుత్వం కొత్త సౌకర్యం తీసుకొచ్చింది. ఇకపై ఒకే కార్డుతో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. మెట్రో, ఆర్టీసీకి కలిపి కామన్ పాస్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు కలిసి ఈ కొత్త సౌకర్యాన్ని ప్రారంభించారు. దీంతో ప్రతిరోజూ ప్రయాణించే వారికి టికెట్ తీసుకోవడం, వేర్వేరు పాస్‌లు పెట్టుకోవడం వంటి ఇబ్బందులు తగ్గనున్నాయి. ప్రస్తుతం డైలీ పాస్, మంత్లీ పాస్ అందుబాటులో ఉన్నాయి.

డైలీ పాస్ ధర రూ.400. ఇందులో మెట్రోకు రూ.300, ఆర్టీసీ బస్సులకు రూ.100 చెల్లించాలి. మంత్లీ పాస్ ధర రూ.8,500. ఇందులో మెట్రోకు రూ.7,000, ఆర్టీసీకి రూ.1,500గా ఉంది. ఈ కామన్ పాస్‌ను మొదటిసారి తీసుకునేటప్పుడు రూ.100 సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాలి. తర్వాత కార్డును తిరిగి ఇచ్చేస్తే ఆ రూ.100ను తిరిగి ఇస్తారు. ఈ ఒక్క కార్డుతో ORR లోపల తిరిగే ఆర్టీసీ సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. అయితే పుష్పక్ బస్సులకు ఈ పాస్ వర్తించదు.

Also Read : ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేను నేనే… విజయా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బస్సులో మాత్రమే వెళ్లేవారికి : కేవలం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించే వారికి నెలవారీ పాస్ ధర రూ.1,630. ఇందులో పాస్ ధర రూ.1,600 కాగా, అదనంగా రూ.30 చెల్లించాలి. 30 రోజులు లేదా 31 రోజులు రోజూ బస్సులో ప్రయాణించేవారికి ఇదే తక్కువ ఖర్చుతో కూడిన ఆప్షన్‌గా ఉంటుంది.

మెట్రోలో మాత్రమే వెళ్లేవారికి : పరేడ్ గ్రౌండ్ నుంచి KPHB వరకు మెట్రో టికెట్ ఒక్క వైపు రూ.66. వెళ్లి రావడానికి రోజుకు రూ.132 ఖర్చవుతుంది. 30 రోజులు రోజూ వెళ్లి వస్తే మొత్తం రూ.3,960 అవుతుంది. 31 రోజులకు రూ.4,092 ఖర్చవుతుంది.

బస్సు + మెట్రో విడివిడిగా తీసుకుంటే : బస్సు నెలవారీ పాస్‌కు రూ.1,630 చెల్లించి, మెట్రోకు రోజూ టికెట్లు తీసుకుంటే.. 30 రోజులకు మొత్తం ఖర్చు రూ.5,590 అవుతుంది. 31 రోజులకు రూ.5,722 అవుతుంది.

Also Read : కేటీఆర్‌కు హైటెక్‌సిటీలో 190 గదుల ఫైస్టార్‌ హోటల్‌..సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు

మరి కామన్ పాస్‌తో ఎంత?

ప్రభుత్వం తీసుకొచ్చిన మెట్రో + ఆర్టీసీ కామన్ మంత్లీ పాస్ ధర రూ.8,500.

అంటే కేవలం బస్సు పాస్‌తో పోలిస్తే ఈ కామన్ పాస్‌కు దాదాపు రూ.6,870 ఎక్కువ ఖర్చవుతుంది. 31 రోజుల లెక్కలో చూస్తే తేడా మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే రోజూ బస్సుతో పాటు మెట్రోను కూడా ఎక్కువగా ఉపయోగించే వారికి ఈ పాస్ వల్ల ఒక సౌకర్యం ఉంటుంది. ఒకే కార్డుతో రెండు సేవల్లో ప్రయాణించవచ్చు. వేర్వేరుగా టికెట్లు లేదా పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ప్రయాణికులు తమకు రోజూ ఎంత ప్రయాణం అవసరమో, ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో చూసుకుని డైలీ లేదా మంత్లీ పాస్‌ను ఎంచుకోవచ్చు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.