Peddi Sudarshan Reddy : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్థరాత్రి కన్ను మూశారు. ఈ నెల 26న ఉదయం హనుమకొండలో ఆయనకు ఛాతీలో నొప్పి రావటంతో స్థానిక రోహిణి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు కార్డియాక్‌ అరెస్ట్‌గా గుర్తించారు. గంట సేపు శ్రమించి తొమ్మిదిసార్లు సీపీఆర్‌ చేశాక.. కొంత ఫలితం కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాగా ఆసుపత్రిలో ఆయనకు అత్యత్తమ వైద్య సేవలు అందించినప్పటికీ చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 12.50 గంటలకు కన్నుమూశారు. ఈ మేరకు సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

కాగా, ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పాటు పలువురు హన్మకొండకు చేరుకున్నారు. ఆసుపత్రిలో ఆయనకు మెరుగైన చికిత్స అందించడంతో ఆయన స్పందించారు. అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ నేతలు ఎప్పటికపుడు ఆరా తీస్తున్నారు. కాగా ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

కాగా, గత ఐదు రోజులుగా వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం కనిపించలేదు. సుదీర్ఘకాలం స్పృహలో లేకపోవడం మూలంగా ఆయనలో నాడీ సంబంధిత స్పందన కనిపించలేదని వైద్యులు నిర్థారించారు. ఆక్సిజన్‌ లోపం కారణంగా మెదడుకు నష్టం జరిగినట్లు ఈసీజీ, బ్రెయిన్‌ ఎంఆర్‌ఐ, టీసీడీ పరీక్షల్లో తేలినట్లు వెల్లడించారు. 5 రోజుల చికిత్స అనంతరం ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణవార్త వినగానే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు నర్సంపేట నియోజకవర్గంలో శోకఛాయలు అలముకున్నాయి. నాయకులు, అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి, ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా దూరమవ్వడం బీఆర్ఎస్ పార్టీకి, నర్సంపేట నియోజకవర్గానికి తీరని లోటని పలువురు పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.

Also Read : పెద్ది చనిపోవడానికి కారణం అదేనా? ఈ నెల 22న అసలేం జరిగింది?

వ్యక్తిగత జీవితం…

తెలంగాణ ఉద్యమ నేతగా, ప్రజా నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1974, ఆగస్టు 6న వరంగల్ గ్రామీణ జిల్లా, నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి గ్రామంలో రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు ఆయన జన్మించారు. 1991లో వరంగల్‌లోని మహబూబియా పంజాథన్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచే ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందించే గుణం ఉన్న ఆయన, నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

రాజకీయ జీవితం

రాజకీయాల తొలిదశలో దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి, 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని స్థాపించగానే ఉద్యమ బాట పట్టారు. రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి మండల జెడ్పీటీసీగా విజయం సాధించి, జెడ్పీ ఫోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2004లో జిల్లా పార్టీ కన్వీనర్‌గా, 2005 చివరలో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సుమారు ఎనిమిదేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీని, వరంగల్ జిల్లా ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2006 నుంచి 2014 వరకు పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ అధినేత కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మారారు. చారిత్రాత్మకమైన ‘మహాగర్జన’ సభతో పాటు తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ కేంద్రంగా జరిగిన ప్రధాన బహిరంగ సభల నిర్వహణలో సుదర్శన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ, సమీప అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేసిన ఆయన, తెలంగాణ పౌర సరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) ఛైర్మన్‌గా నియమితులై సమర్థవంతమైన పాలనా ముద్ర వేశారు.

తొలిసారి ఎమ్మెల్యేగా..

అనంతరం 2018 ముందస్తు ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, 16,949 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో 2018లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగానూ సేవలు అందించారు. నియోజకవర్గ అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓటమిని చవిచూశారు.

సుదర్శన్ రెడ్డికి భార్య స్వప్న, కుమారుడు నిధర్షన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీ బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం శ్రమించిన ఓ ప్రజానుకూల నేతను కోల్పోవడం పట్ల నర్సంపేట ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పలువురు ముఖ్య నాయకులు తరలివస్తున్నారు.

Also Read : ఖరారు కానీ మెడికల్ కాలేజీల ఫీజు… ఆందోళనలో విద్యార్థులు

ఈ రోజు 3 గంటలకు అంత్యక్రియలు

కాగా, సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని ఈ రోజు ఉదయం నర్సంపేటకు తరలించనున్నారు. అనంతరం  హనుమకొండలోని అమరవీరుల స్తూపం వద్ద కొంత సమయం ఉంచి నివాళులర్పించిన తర్వాత నర్సంపేటకు తీసుకెళ్తారు. అనంతరం సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆయన అంతిమ యాత్రలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు. మరోవైపు, సుదర్శన్ రెడ్డి మృతితో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.