Hyd Metro : మెట్రోలో ప్రయాణించే ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌ చెప్పడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని మెట్రో ఫేజ్‌ 2 కోసం భూ సేకరణ చేపట్టడం, మెట్రో పనులకు త్వరలో టెండర్లు పిలవడంతో పాటు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యా్ర్థం కొత్త కోచ్‌లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)పై సంబంధిత ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో పనులకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. దీనికోసం ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 7.5 కి.మీ పొడవునా రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ కారిడార్‍లో మెట్రో పనులను చేపట్టడానికి వీలుగా టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు. మెట్రో విస్తరణకు సంబంధించి పెండింగ్‍లో ఉన్న భూ సేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Also Read : కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి..రేవంత్‌ ఫోన్‌ ఎత్తడం లేదు..పోచారం సంచలన వ్యాఖ్యలు

రద్దీని తట్టుకునేలా అదనపు బోగీలు

హైదరాబాద్ మెట్రో రైలుకు రోజురోజుకు రద్దీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను కోరారు. ప్రయాణీకుల రద్దీకి తగినట్టుగా మెట్రో రైల్‍కు అదనపు బోగీలను జత చేయాలని వారికి సూచించారు. ఇందుకు అవసరమైన మెట్రో రైల్ కోచెస్‍ను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారిని కోరారు. మెట్రో ఫేజ్-2 కారిడార్ కోసం ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రో అధికారులను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.

Also Read : 22ఏ భూముల వివాదం.. అప్పటి వరకు ఛాన్స్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

డిసెంబర్‍లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..

దీనితో పాటు డిసెంబర్‍లో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‍కు సంబంధించి కూడా సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. దీనికోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి ఏర్పాట్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాపార రంగంలో వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్‍లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని దానికోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు ఆదేశించారు. గత ఏడాది నిర్వహించిన సమ్మిట్‍లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పురోగతికి సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించి నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలన్నారు..

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.