
Khairatabad Ganesh: గణపతి నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిమజ్జనం కూడా కొనసాగుతోంది. కాగా, రాష్ర్టంలోనే ప్రత్యేకత సంతరించుకున్న ఖైరతాబాద్గణేష్ దర్శనానికి ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఉదయం 5 గంటల నుంచే భక్తుల రాకతో ఖైరతాబాద్ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. గణేశుని దర్శనానికి ఖైరతాబాద్ చౌరస్తా నుంచి భారీకేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేయగా, క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో క్యూలైన్ల బయట కూడా జనం నిండిపోయారు.
ఇక గణేశుని దర్శనం అయ్యాక ప్రజలు ట్యాంక్‌బండ్ వద్ద జరుగుతున్న నిమజ్జనం చూడడానికి ట్యాంక్‌బండ్ మీదకు చేరుకుంటుండంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఈ ఆదివారం తర్వాత సెలవులు లేకపోవడం 24న నిమజ్జనం పూర్తి కానుండటంతో ఖైరతాబాద్‌కు భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తుల రాకతో హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, నెక్లేస్ రోడ్ ప్రాంతాలు రద్దీగా మారాయి. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ భక్తులు గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తుండంటంతో ఆదివారం ఆర్థరాత్రి వరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మంటపాల వద్ద అన్నదానాలు
ఆదివారం కావడంతో పాటు నిమజ్జనం దగ్గర పడటంతో ఈ రోజు నగరంలోని పలు వినాయక మంటపాల వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అన్నప్రసాదాన్ని స్వీకరించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో నగరమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. నగర వ్యా్ప్తంగా ఏర్పాటు చేసిన వినాయక మంటపాలు సాంస్కృతిక కార్యక్రమాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలతో అలరారుతున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.









