Mancherial : తన తల్లికి ఆరోగ్యం బాలేదని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే అక్కడ కుమారుడికి నిరాశే ఎదురైంది. వైద్యులు పట్టించుకోక పోవడంతో ఆ వ్యక్తి తన తల్లిని వీల్‌ ఛైర్‌ లో కూర్చోబెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించే స్థోమత లేని ఓ కొడుకు ఎలాగైనా తన తల్లికి మెరుగైన చికిత్స అందించాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ తల్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు, మరింత మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తీసుకువెళ్లాలని సూచించారు. అయితే తన తల్లి కనీసం నిలబడలేని, కూర్చోలేని పరిస్థితుల్లో ఉందని ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు ఒక బెడ్​ ఇవ్వండని ఆ కుమారుడు ఆస్పత్రి వైద్యులను వేడుకున్నాడు. కానీ, వారు బెడ్స్ ఖాళీ లేవని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో కోపోద్రేకుడైన కుమారుడు తన తల్లిని వీల్​చైర్​లో కూర్చోబెట్టుకుని నేరుగా ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​ రావు ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన భూక్య బుజ్జి (55) అనే మహిళా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు చికిత్స అందించేందుకు కుమారుడు రాజ్‌ కుమార్ మంగళవారం రాత్రి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అక్కడ తన తల్లికి వైద్యం చేయకుండా సిబ్బంది 5 గంటల పాటు వీల్‌ ఛైర్‌లో కూర్చోబెట్టారని రాజ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెను వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారని రాజ్​కుమార్​ వెల్లడించారు. అక్కడికి తీసుకెళ్లేంతవరకు బెడ్​ను కేటాయించాలని రాజ్​కుమార్ అక్కడి సిబ్బందిని కోరాడు. అయితే ఆస్పత్రిలో బెడ్​లు ఖాళీ లేవని వారు స్పష్టం చేశారు. ఎంత బతిమాలిన మానవత్వం చూప లేదని రాజ్​కుమార్ ఆరోపించారు. దీంతో ఆమెను ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపాడు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటిముందు నిరసనకు దిగడంతో స్థానికంగా చర్చనీయంశంగా మారింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​ రావు లేక పోవడంతో సెక్యూరిటీ సిబ్బంది బాధితుడికి విషయం చెప్పారు. అయినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, రాజ్​కుమార్​ను సముదాయించి ఆస్పత్రికి ఫోన్​ చేసి ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. అనంతరం బాధితురాలికి తప్పకుండా సౌకర్యాలు కల్పిస్తారని వైద్యులు చెప్పడంతో రాజ్​కుమార్​తన తల్లిని ఆటోలో తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆర్‌ఎంవో హామీతో రాజ్‌కుమార్ శాంతించడంతో వివాదం సద్దుమణిగింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.