Heavy Rains : మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నదిపై ఉన్న శ్రీరామసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి భారీగా ఇన్-ఫ్లో పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాలకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 75,432 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, గురువారం సాయంత్రానికి నీటి నిల్వ 21.2 టీఎంసీలకు చేరుకోవడంతో ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సారెస్పీ నిండటం వల్ల తెలంగాణ వ్యవసాయ రంగానికి కొండంత ఊరట లభించనుంది. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి రెండు దశల్లో విస్తారమైన ఆయకట్టు ఉంది. స్టేజ్-1 కింద దాదాపు 9.68 లక్షల ఎకరాలు, స్టేజ్-2 కింద 4.80 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 14.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తాజా వరదల వల్ల ఖరీఫ్ పంటలకు సాగునీటి కొరత తీరడమే కాకుండా, భూగర్భ జలాలు గణనీయంగా పెరిగే అవకాశముంది.

ఎస్సారెస్పీకి దిగువన ఉన్న ప్రధాన జలాశయాలకు కూడా వరద ముప్పు పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లు తెరిచి 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ఉధృతికి తోడు స్థానిక వర్షపు నీరు తోడవడంతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, ఇప్పటికే నిల్వ 19.70 టీఎంసీలకు చేరుకోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువనున్న మేడిగడ్డ బ్యారేజీకి విడుదల చేస్తున్నారు.

ఎల్లంపల్లికి వరద పోటెత్తడంతో రాజరాజేశ్వర మధ్య మానేరు జలాశయానికి నీటిని తరలించే ఎత్తిపోతల ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. బుధవారం నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలో నాలుగేసి మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసిన అధికారులు, గురువారం నీటి ఉధృతి పెరగడంతో నంది పంప్‌హౌస్‌లో 5వ మోటారును ప్రారంభించారు. దీంతో నంది రిజర్వాయర్‌లోకి ప్రవాహం 15,750 క్యూసెక్కులకు పెరిగింది. అక్కడి నుంచి సొరంగాల ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్‌కు నీటిని పంపి, 5 మోటార్ల సహాయంతో వరద కాలువ ద్వారా మధ్య మానేరుకు తరలిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదావరి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత ఉధృతితో మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ నుంచి 3.31 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న ఇంద్రావతి వరద నీరు, స్థానిక వాగుల ప్రవాహం గోదావరిలో కలవడంతో సమ్మక్క బ్యారేజీ (తుపాకులగూడెం) వద్ద ఏకంగా 9.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Also Read : పెద్ది చనిపోవడానికి కారణం అదేనా? ఈ నెల 22న అసలేం జరిగింది?

వరద ఉధృతి పెరగడంతో మౌలిక వసతులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ములుగు జిల్లా పరిధిలోని తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని టేకులగూడెం సమీపంలో గల రేగుమాకుగండి వద్ద వరద నీరు రహదారిపైకి భారీగా చేరుకుంది. దీంతో హైదరాబాద్ – భూపాలపట్నం 163వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు తెగిపోవడంతో ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గోదావరి ఉపనదులన్నీ ఏకమవడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. గురువారం రాత్రి 8 గంటల సమయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 28.70 అడుగులకు చేరుకోగా, ప్రవాహం 3.97 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న ప్రవాహ వేగాన్ని బట్టి భద్రాచలం వద్ద నీటిమట్టం త్వరలోనే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి (43 అడుగులు) చేరుకునే అవకాశం ఉందని ఐఆర్ఆర్ (Irrigation) అధికారులు అంచనా వేస్తున్నారు. తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

మరోవైపు కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. కర్ణాటకలోని ఎగువ కృష్ణా ప్రాజెక్టులైన ఆలమట్టికి 83 వేల క్యూసెక్కుల ఇన్-ఫ్లో వస్తుండగా, దిగువకు 97 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే నారాయణపూర్ జలాశయానికి 95 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో, అధికారులు 1.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న ఈ నీటితో తెలంగాణలోకి కృష్ణమ్మ ఉత్సాహంగా అడుగుపెడుతోంది.

ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు అయిన జూరాలకు గురువారం రాత్రికి 1.04 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ,గేట్లు ఎత్తి దిగువకు 1.09 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 1.12 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. శ్రీశైలం పూర్తి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, గురువారం సాయంత్రానికి నీటిమట్టం 46.82 టీఎంసీలకు చేరింది.

శ్రీశైలం,జూరాల వద్ద వెనుక జలాలు (Backwaters) తగినంతగా చేరడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయకట్టు ఆధారిత ఎత్తిపోతల పథకాలను ప్రారంభించింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మొదటి దశ పంప్‌హౌస్ నుంచి ఎల్లూరు జలాశయంలోకి 1,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. అలాగే జూరాల వెనుక జలాలపై ఆధారపడి నడిచే భీమా, నెట్టెంపాడు వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా నీటి తోడుత ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.

Also Read : కరువు భయాలను తుడిచిపెట్టిన వరుణదేవుడు: తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.