Telangana Congress
Telangana Congress

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గపోరు సెగలు రేపుతోంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం ఒక రేంజ్‌లో రగిలిపోతోంది. ‘మా జోలికొస్తే మీ రాజకీయాన్ని సమాధి చేస్తాం.. చావుదెబ్బ తీస్తాం’ అని ఒక ఎమ్మెల్యే హెచ్చరిస్తే.. ‘ఒక తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించి గెలిపించినందుకు క్షమించండి’ అంటూ మరో ఎమ్మెల్యే క్షమాపణలు కోరడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. వాళ్లెవరో కాదు.. ఒకరు మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, మరొకరు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. అసలు వీరిద్దరి మధ్య మొదలైన వివాదం ఏంటి ? నియోజకవర్గాలపై పెత్తనమా? లేక కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటమా? ఈ రచ్చపై TPCC తీసుకున్న నిర్ణయం ఏంటి.ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ముందుగా ఈ వివాదానికి ప్రధాన బీజం ఎక్కడ పడిందో చూద్దాం. ఉమ్మడి నల్లొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి ఇటీవల రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటనకు వెళ్లారు. అక్కడ ఒక రోడ్డు పరిశీలనకు సంబంధించి అధికారిక కార్యక్రమం జరిగింది. అయితే, అక్కడి స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్‌కు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీస ‘ప్రోటోకాల్’ పాటించకుండా మంత్రి పర్యటించడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సామేల్, మీడియా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగంగానే మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. తుంగతుర్తికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడనే విషయం మంత్రికి తెలియదా? అంటూ నిలదీశారు. వందలసార్లు రోడ్డు మంజూరు చేయాలని కోరినా స్పందించని మంత్రి, ఇప్పుడు తనకు చెప్పకుండా పర్యటించడం ఏంటని ప్రశ్నించారు.

అలాగే మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి తన సొంత నియోజకవర్గాన్ని వదిలేసి, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు, కేడర్ విషయంలో పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. దళిత నియోజకవర్గాలంటే కోమటిరెడ్డి సోదరులకు చిన్నచూపని.. దళితులంటే ఎవరికీ బానిసలు కాదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తమ గౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, తమ జోలికొస్తే ఎదుటివారి రాజకీయ సమాధికి డప్పులు కొడతామని హెచ్చరించారు. తాము 50 వేలకు పైగా భారీ మెజారిటీతో ప్రజల ఆదరణతో గెలిచామని, కోమటిరెడ్డి సోదరుల దయాదాక్షిణ్యాల వల్ల కాదని స్పష్టం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి తుంగతుర్తి నియోజకవర్గంతో ఏం పని అని, ముందుగా ఆయన తన నియోజకవర్గ సమస్యలను చూసుకోవాలని హితవు పలికారు. గతంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లి.. మళ్లీ వచ్చిన చరిత్ర రాజగోపాల్ రెడ్డిదని విమర్శలు చేశారు. సామెల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి.

సామేల్ చేసిన వ్యాఖ్యలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సామేల్‌పై కౌంటర్ అటాక్ చేశారు. ”తుంగతుర్తిలో ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించాను. నా పిలుపు మేరకు మందుల సామేల్‌ను ఎమ్మెల్యేగా గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులకు నేను క్షమాపణలు కోరుతున్నాను” అంటూ సంచలన ప్రకటన చేశారు. సామేల్ టికెట్ కోసం తన ఇంటికి వందసార్లు తిరిగారని, ఆయన తిరుపతిలో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి వేడుకుంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించానని చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక తనపైనే విషం కక్కుతున్నాడని, సామేల్‌కు వినాశకాలే విపరీత బుద్ధి వచ్చిందని మండిపడ్డారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన ఆయారాం, గాయారాంల వల్ల మొదటి నుంచి ఉన్న అసలైన సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం జరుగుతోందని రాజ్‌గోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు.

ఈ ఇద్దరి నాయకుల మధ్య నడుస్తున్న ఈ వివాదం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఉమ్మడి నల్లొండ జిల్లా అనేది మొదటి నుంచీ పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇప్పుడు అక్కడ సీనియర్లు, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల మధ్య నియోజకవర్గాలపై ఆధిపత్యం విషయంలో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడం దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే సామేల్ దీనికి ‘దళితులపై వివక్ష’ అనే కోణాన్ని తీసుకురావడం వల్ల పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లు ఈ వివాదానికి త్వరలోనే చెక్ పెట్టకపోతే జిల్లాలో పార్టీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు.

ఏదేమైనా, ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, ప్రజలకు సంక్షేమం అందించాల్సిన నాయకులు ఇలా బహిరంగంగా రోడ్డెక్కి విమర్శలు చేసుకోవడం కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. మరి ఈ వివాదంలో ఎవరు చెప్పింది నిజం? ప్రోటోకాల్ విషయంలో సామేల్ లేవనెత్తిన ప్రశ్నలు సరైనవేనా? లేక తన నియోజకవర్గానికి టికెట్ ఇప్పించిన సీనియర్లపై సామేల్ చేసిన వ్యాఖ్యలు సరికాదా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.