HYDRAA : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను వీలైనంత త్వరగా ఆ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా వ్యవస్థకు ఇది ఊహించని పెద్ద షాక్‌ అనే చెప్పాలి. శాంతాశ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు సంబంధించిన దాదాపు 40 ఎకరాల భూ వివాదంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైడ్రా అధికారులు తీవ్రంగా ఉల్లంఘించారని హైకోర్టు స్పష్టం చేసింది.

Also Read : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు

వివాదాస్పద ఆస్తిలోకి కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా భారీ యంత్రాలు, మనుషులతో ప్రవేశించి జోక్యం చేసుకోవడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వ్యవహరించారని, ఆయనపై ఇప్పటికే అనేక కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ ఆ పదవిలో కొనసాగితే చట్టం పరిధి నీరుగారిపోతుందని, ప్రజాస్వామ్యంలో రూల్ ఆఫ్ లా దెబ్బతింటుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ స్థానంలో తగిన వేరే సెక్రటరీ స్థాయి అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్న హైడ్రా చీఫ్‌పై కోర్టు ఏకంగా బదిలీ వేటు వేయడం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు ఈ తీర్పును ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణిస్తుండగా, రేవంత్ సర్కార్ మాత్రం ఈ తీర్పుపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Also Read : ఖరారు కానీ మెడికల్ కాలేజీల ఫీజు… ఆందోళనలో విద్యార్థులు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.