Telangana High Court : హైదరాబాద్‌ ఐటీ హబ్‌ పరిధిలోని రాయదుర్గం  భూముల వేలం వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి చుక్కెదురైంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఈ భూముల వేలంపై మూడు వారాల పాటు మధ్యంతర స్టే విధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIIC), గౌర వెంచర్స్‌తో పాటు ఎస్‌బీఐకి కూడా నోటీసులు జారీ చేసింది.

రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లో గల ఐదు ఎకరాల భూమిపై హక్కులు కోరుతూ ఎస్‌బీఐ హైకోర్టులో రెండు వేర్వేరు రిట్ పిటిషన్లు దాఖలు చేసింది. మే 6న ప్రభుత్వం జారీ చేసిన వేలం నోటిఫికేషన్‌తో పాటు, తమ వినతిపత్రాన్ని తిరస్కరిస్తూ మే 20న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను బ్యాంక్ యాజమాన్యం సవాల్ చేసింది. గతంలో 2010లో అప్పటి ప్రభుత్వం రాయదుర్గంలో అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (SBH)కు రూ. 13.33 కోట్ల చెల్లింపుపై ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. ఆ తర్వాత ఎస్‌బీహెచ్‌ సంస్థ ఎస్‌బీఐలో విలీనం కాగా, ప్రస్తుతం అక్కడ రెండు ఏటీఎంలను ఎస్‌బీఐ నిర్వహిస్తోంది. అయితే, గత ప్రభుత్వం 2020లో, ప్రస్తుత ప్రభుత్వం 2024లో ఈ కేటాయింపులను రద్దు చేయడాన్ని బ్యాంక్ తీవ్రంగా తప్పుబట్టింది.

టీజీఐఐసీ ఇటీవల నిర్వహించిన ఈ వేలంలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో రూ. 237 కోట్లు పలకడం, ఆ ఐదెకరాల స్థలాన్ని ‘గౌర వెంచర్స్’ దక్కించుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ వేలంపై కోర్టులో ఇరుపక్షాల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ (AAG) వాదిస్తూ.. 2010 నాటి ఒప్పందం ప్రకారం రెండేళ్లలోనే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, 16 ఏళ్లు గడిచినా ఎస్‌బీఐ ఎలాంటి పనులు చేపట్టలేదని, నిబంధనల ఉల్లంఘన వల్లే భూమిని వేలానికి పెట్టాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు.

ఈ వాదనలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. “అది ఎస్‌బీఐకి కేటాయించిన భూమి అని తెలిసి కూడా ఒక ప్రభుత్వ సంస్థ స్థలాన్ని ఇలా ఎలా వేలం వేస్తారు? ఇలా భూములను వేలం వేస్తూ రాష్ట్రంలో స్థిరాస్తి (Real Estate) వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలనుకున్నారా?” అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఏఏజీ స్పందిస్తూ, ఈ వేలం ద్వారా వచ్చే నిధులను ప్రజా శ్రేయస్సు, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం భావించిందని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు ఈ వేలం ప్రక్రియపై స్టే విధిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.