Rains
Rains

Heavy Rains In Telangana : ఎల్‌నినో ప్రభావంతో ఎటుచూసినా కరువు ఛాయలు అలముకుంటాయేమోనన్న ఆందోళనల నడుమ, తెలంగాణ రాష్ట్రంపై వరుణదేవుడు అపారమైన కరుణ చూపాడు. రాజధాని హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మునుపటి కరువు భయాలన్నీ పటాపంచలై, రాష్ట్రమంతటా జలకళ సంతరించుకుంది.భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు ఏకమై ప్రవహిస్తుండగా, ఊళ్లలోని చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారి పొంగిపొర్లుతున్నాయి. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గురువారం రాత్రి నాటికి దాదాపు 3,90,300 క్యూసెక్కుల ప్రవాహం రావడంతో, అధికారులు 30 గేట్లను ఎత్తి గోదావరిలోకి 4,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలకు ఎలాంటి తీవ్ర అవస్థలు కలగకుండా చూడాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి జిల్లా కలెక్టర్లతో అత్యవసర టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించి, సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని సూచించారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతోనే ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తూ వివిధ జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

Also Read : పెద్ది చనిపోవడానికి కారణం అదేనా? ఈ నెల 22న అసలేం జరిగింది?

ఉమ్మడి కరీంనగర్‌తో పాటు కుమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో గురువారం వర్షం దంచికొట్టింది. ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 183.5 మి.మీ, జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో 128.1 మి.మీ, వెల్గటూరులో 103.5 మి.మీ వర్షపాతం నమోదైంది. వరద ఉధృతికి సారంగాపూర్‌ శివారులోని బతుకమ్మ కుంట కట్ట తెగడం, ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది. ముందుజాగ్రత్తగా జగిత్యాల జిల్లాలోని విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. పలిమెల మండలంలో 155.8 మి.మీ వర్షపాతం నమోదుకాగా, కాటారం అలుగువాగు పొంగటంతో పలు ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. టేకుమట్ల మండలంలో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిరంతర వర్షం కారణంగా సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది.

ఈ వర్షాలు రైతాంగానికి కొండంత ఊరటనిచ్చాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనప్పటికీ వర్షాభావంతో విత్తనాలు భూమిలోనే మాడిపోయి, పలుచోట్ల ఉమ్మడి వరంగల్‌ రైతులు రెండోసారి పత్తి విత్తనాలు వేశారు. ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షం పత్తి, వరి పంటలకు ఎంతో మేలు చేస్తుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో అంచనా వేసిన 4.38 లక్షల ఎకరాల్లో ఇప్పటికే దాదాపు రెండు లక్షల ఎకరాల్లో సాగు పనులు వేగవంతమయ్యాయి.

ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి 7,10,300 క్యూసెక్కుల వరద రాగా, అధికారులు మొత్తం 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి 2.12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం 7.2 మీటర్లకు పెరిగింది. భద్రాచలం వద్ద శుక్రవారానికి మొదటి ప్రమాద హెచ్చరిక (43 అడుగులు) దాటే అవకాశముందని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు.ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్లు నిండటంతో కృష్ణానదిలో వరద ఉధృతి ప్రారంభమైంది. దాదాపు ఒక లక్ష క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టు వైపు వస్తుండటంతో నాగార్జునసాగర్, శ్రీశైలం ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్, మంజీరా నదులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.

తెలంగాణ నయాగరాగా పిలువబడే ములుగు జిల్లాలోని ‘బొగత జలపాతం’ పాలసంద్రంలా ఉప్పొంగి ప్రవహిస్తోంది. పచ్చని కొండల నడుమ జాలువారుతున్న ఈ జలపాతం ఎంతో మనోహరంగా మారినప్పటికీ, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు పర్యాటకుల సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా కారణ దృష్ట్యా పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు పర్యాటకులు సహకరించాలని కోరారు.

Also Read : ఎల్‌నినో ఎఫెక్ట్.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.