
ఐక్యరాజ్యసమితి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఓ ఘటన జరిగింది. ఇజ్రాయెల్‌ను తొలిసారిగా లైంగిక హింస, చిన్నపిల్లల హక్కుల ఉల్లంఘనల బ్లాక్‌లిస్టులో చేర్చడంపై ఆ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐరాస వేదికపై ఇజ్రాయెల్ రాయబారి డ్యానీ డానన్.. ఐరాస ఉన్నతాధికారులతో బహిరంగంగానే పెద్ద గొడవకు దిగారు. ఓ దశలో సహనం కోల్పోయి అక్కడే ఉన్న ఒక మహిళా అధికారిణిపై “నోరు మూసుకోండి.. లేదంటే బయటకు పోండి” అంటూ తీవ్రంగా అరిచారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనం రేపుతోంది.
న్యూయార్క్‌లో శుక్రవారం సాయుధ ఘర్షణల్లో లైంగిక హింస నిర్మూలన దినోత్సవం అనే అంశంపై ఐరాస ఓ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ మీటింగ్‌లో ఇజ్రాయెల్ రాయబారి డ్యానీ డానన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ను తప్పుడు ఆరోపణలతో బ్లాక్‌లిస్టులో చేర్చారంటూ ఐరాస ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్కు ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేయడం అలవాటుగా మారిందన్నారు. ఇక్కడితో ఆగకుండా వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Israeli ambassador to the United Nations, Danny Danon, got in a shouting match with the U.N.'s special representative for children and armed conflict, Vanessa Frazier, after she interrupted his remarks at Friday's meeting regarding allegations that Israeli soldiers and settlers… pic.twitter.com/Qp8hEuN6HU
— CBS News (@CBSNews) June 20, 2026
ఇలా ఇజ్రాయెల్ రాయబారి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు, యుద్ధ ఘర్షణల విభాగంలో ఉన్న ఐరాస ప్రతినిధి వానెస్సా ఫ్రాజియర్ జోక్యం చేసుకున్నారు. ఐరాస వేదికపై ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయవద్దని ఆమె వారించారు. నివేదికలో పేర్కొన్న విషయాలన్నీ పక్కా ఆధారాలతోనే నమోదు చేశామని స్పష్టం చేశారు. ఆమె మాటలకు ఇజ్రాయెల్ రాయబారి డ్యానీ డానన్కు ఎక్కడలేని కోపం వచ్చింది.
ఆగ్రహంతో ఊగిపోయిన డానన్.. మేము ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశం. మీరు ఇక్కడ కేవలం ఒక ఐరాస ఉద్యోగి మాత్రమే. మీ హద్దులో మీరుండాలి. ఇప్పుడు మీరు నోరు మూసుకోవాలి.. లేదంటే ఇక్కడి నుండి బయటకు పోండి. మీరు తయారు చేసిన నివేదిక సిగ్గుచేటు అంటూ అందరి ముందూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. రాయబారి ప్రవర్తనతో ఐరాస హాల్లోనే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అయితే ఇటీవల ఐరాస విడుదల చేసిన రెండు కీలక నివేదికల్లో ఇజ్రాయెల్‌ను అపఖ్యాతి పాలైన బ్లాక్‌లిస్టులో చేర్చింది. గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ సైన్యం లైంగిక హింసకు పాల్పడిందని, అలాగే పాలస్తీనాకు చెందిన చిన్నపిల్లలపై తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు ఒడిగట్టిందని ఐరాస ఆ నివేదికల్లో ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు శత్రువైన హమాస్ సంస్థ కూడా ఇదే బ్లాక్‌లిస్టులో కొనసాగుతోంది. తమను హమాస్‌తో సమానంగా చూడటాన్ని ఇజ్రాయెల్ అస్సలు తట్టుకోలేకపోతోంది. ఈ నివేదికలు బయటకు వచ్చినప్పటి నుంచే ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ఇదంతా పక్షపాత ధోరణి అని కొట్టిపారేస్తుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రెస్‌తో తమ దేశ అధికారిక సంబంధాలను కూడా పూర్తిగా తెంచుకుంటామని హెచ్చరించింది.









