
Iran : తమ దేశం ఇరాన్ పై మరోసారి బలవంతంగా యుద్ధాన్ని రుద్దాలని ప్రయత్నిస్తే, ఈసారి మరింత విధ్వంసకరమైన, అత్యాధునిక ఆయుధాలను ప్రయోగిస్తామని ఇరాన్ తాజాగా అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది. గతంలో ఎదుర్కొన్న యుద్ధాల తర్వాత తమ దేశ సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నామని ఇరాన్ తెలిపింది. ఇప్పుడు మొదలయ్యే ఎలాంటి యుద్ధం లోనైనా తమ ఆయుధాలు భిన్నంగా ఉంటాయని ఇరాన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
ఈ సందర్భంగా గురువారం ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికార ప్రతినిధి హుస్సేన్ మొహెబ్బి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. “గత ఏడాది జూన్, ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ మాపై సాగించిన బలవంతపు యుద్ధాల మూలంగా మా సైనిక శక్తిని మరింత విస్తరించుకున్నాం. ఒకవేళ కొత్తగా యుద్ధం ప్రారంభమైతే, మా క్షిపణుల వార్హెడ్లు, వాటి కచ్చితత్వం, పరిధి విషయంలో భారీ మార్పులు ఉంటాయని హెచ్చిరించాడు. గతంలో వాడిన వాటి కంటే కొత్త క్షిపణుల విధ్వంసకర శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది” అని ఆయన హెచ్చరించారు. ఆయుధాల ఉత్పత్తిని ఇరాన్ ఎన్నడూ ఆపలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, యుద్ధం ముగింపు విషయమై అమెరికాతో రహస్య చర్చలు జరుగుతున్నాయంటూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మొహెబ్బి తిప్పికొట్టారు. ఐఆర్జీసీ అధికారులు అమెరికన్లతో ఎలాంటి చర్చలు జరపడం లేదని తేల్చి చెప్పారు, ట్రంప్ వ్యాఖ్యలు కేవలం ‘భ్రమ’ అని కొట్టిపారేశారు. వాషింగ్టన్ తన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలం అవ్వడం వల్లే ప్రస్తుతం ఆ దేశంతో దౌత్యపరమైన చర్చలు కూడా జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదే విషయంపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ ఇరాకీ కుర్దిస్థాన్ అధికారుల ద్వారా అమెరికాతో రహస్యంగా సమావేశమయ్యారంటూ వస్తున్న వార్తలను కొట్టి పడేశారు. అది అవాస్తవమని అన్నారు. ఇరాన్ నిర్ణయాధికార వ్యవస్థలో విభేదాలు సృష్టించేందుకు పన్నుతున్న మీడియా ఎత్తుగడలు మాత్రమే నన్నారు, మానసిక యుద్ధంలో భాగమే ఈ ప్రచారమని ఆయన ఆక్షేపించారు. గతంలో ఇరుపక్షాల మధ్య ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ఒప్పందం, జూన్ 18న యుద్ధాన్ని ముగించేందుకు అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం తరచుగా కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే.









