
BLA : బలూచిస్తాన్‌లోని పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ క్యాంప్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 30 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది మరణించారని, పలువురు గాయపడ్డారని ఆ సంస్థ ప్రకటించింది. గ్వాదర్ జిల్లా పరిధిలోని జీవాని ప్రాంతంలో ఉన్న కోస్ట్ గార్డ్ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ వినాశకర దాడి జరిగినట్లు సమాచారం.
Breaking: BLA media has published video of today’s attack on Pakistan coast guards camp in Jiwani, #Balochistan. Attack carried out by BLA’s “Majeed Brigade” & “Fateh Squad” – Says Jeeyand Baloch pic.twitter.com/BCyPsGv9fg
— Bahot (@Bahotblch) July 3, 2026
‘ది బలూచిస్తాన్ పోస్ట్’ నివేదిక ప్రకారం.. BLAకి చెందిన ప్రత్యేక విభాగం ‘మాజిద్ బ్రిగేడ్’ ఈ దాడిని చేపట్టింది. జీవానిలోని పన్వాన్ ప్రాంతంలో ఉన్న కోస్ట్ గార్డ్స్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని తమ ఫైటర్లు ముందుగా క్యాంప్‌లోకి చొరబడ్డారని, ఆ తర్వాతే ఈ ‘ఫిదాయీన్’ (ఆత్మాహుతి) దాడికి పాల్పడ్డారని BLA ప్రతినిధి జీయంద్ బలోచ్ ఒక ప్రకటనలో తెలిపారు. చైనా సహకారంతో నిర్మిస్తున్న భారీ పోర్ట్ ప్రాజెక్ట్ కారణంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంగా మారిన గ్వాదర్ జిల్లాలో ఈ దాడి జరగడం గమనార్హం.
పాకిస్థాన్ భద్రతా బలగాలకు వ్యతిరేకంగా తాము సాగిస్తున్న సుదీర్ఘ పోరాటంలో భాగంగానే ఈ దాడి చేసినట్లు BLA పేర్కొంది. బలూచిస్తాన్ ప్రాంతం విస్తీర్ణం పరంగా పాకిస్థాన్‌లోనే అతిపెద్దది అయినప్పటికీ, ఇక్కడ జనాభా చాలా తక్కువ. తమ సహజ వనరులపై తమకే నియంత్రణ ఉండాలని, తమకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే BLA గత కొన్నేళ్లుగా పాక్ సైన్యం, పారామిలట్రీ దళాలు, ప్రభుత్వ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది.
ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. భద్రతా దళాలపై, ప్రభుత్వ సంస్థలపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. BLAను పాకిస్థాన్‌తో పాటు పలు ఇతర దేశాలు కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. గతంలో కూడా ఈ సంస్థ అనేక పెద్ద ఆత్మాహుతి పేలుళ్లకు, సాయుధ దాడులకు పాల్పడింది. అయితే, తాజా దాడికి సంబంధించి మరణాల సంఖ్యపై పాక్ అధికారిక వర్గాల నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. దీంతో BLA చేప్తున్నట్లు30 మంది మృతి చెంది ఉంటారని తెలుస్తోంది.









