
Tehran Explosion : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో శనివారం చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. నగరం లోని తూర్పు ప్రాంతాలైన పాక్‌దష్త్, ఖియామ్‌దష్త్ ప్రజలు ఒక్కసారిగా వచ్చిన ప్రచండమైన శబ్దానికి ఉలిక్కిపడ్డారు. ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య తీవ్రమైన దౌత్య, సైనిక ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, మళ్లీ ఏదైనా క్షిపణి లేదా వైమానిక దాడి జరిగిందేమోనని స్థానికులు భావించారు.
అయితే ఈ భయాందోళనలకు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా త్వరితగతిన తెరదించింది. ఆ పేలుడు శబ్దం ఏ విధమైన శత్రు దాడి వల్ల వచ్చింది కాదని సైనిక అధికారులు స్పష్టం చేశారు.గతంలో జరిగిన యుద్ధాలు , సైనిక చర్యల సమయం నుంచి మిగిలిపోయిన పాత మందుగుండు సామగ్రిని (Unexploded Ordnance) భద్రతా నిబంధనలకు అనుగుణంగా నియంత్రిత పద్ధతిలో (Controlled Demolition) నిర్వీర్యం చేస్తుండగా ఈ పేలుడు సంభవించిందని అధికారులు అధికారికంగా ప్రకటించారు.
Also Read : POKలో తిరుగుబాటు.. చేతులెత్తేసిన పాక్ సైన్యం: రంగంలోకి 4 వేల మంది అదనపు బలగాలు!
ఈ ప్రక్రియ అంతా ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్న సైనిక శిక్షణ స్థలంలోనే జరిగిందని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదమూ లేదని సైన్యం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదని, పరిస్థితి అంతా పూర్తిగా అదుపులోనే ఉందని వెల్లడించారు.
పేలుడు జరిగిన తొలి నిమిషాల్లో సరైన సమాచారం లేకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, పుకార్లు వేగంగా వ్యాపించాయి. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న భయాన్ని నివారించడానికి ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది. ప్రభుత్వ అధికారిక ప్రకటనతో పుకార్లకు చెక్ పడటమే కాకుండా టెహ్రాన్ వాసులు ఉపశమనం పొందారు.
Also Read : భారత్‌లో ఐరన్ డోమ్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రం: ఇజ్రాయెల్ రక్షణ సంస్థ ‘రాఫెల్’ చర్చలు!









