Mojtaba Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలై ఆరు నెలలు పూర్తైన సందర్భంగా ముస్లిం దేశాలకు ఓ లేఖ రాసిన ఆయన.. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రాంతంలోని ముస్లిం దేశాలన్నీ ఒక్కటిగా నిలవాలని కోరారు. షియా ముస్లింలు ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఈ సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం దేశాల సమస్యలకు ఐక్యత, స్నేహం, కలిసి పనిచేయడమే పరిష్కారమని చెప్పారు.

ముస్లింల మధ్య విభేదాలు, గొడవలు పెరగడానికి కారణమయ్యే పనులు చేసే వారు తెలిసి చేసినా, తెలియక చేసినా ఇస్లాం శత్రువులకు ఉపయోగపడుతున్నట్లేనని ఖమేనీ అన్నారు. ప్రాంతంలోని దేశాల పాలకులు తమ ‘‘నిజమైన శత్రువును గుర్తించాలని’’ ఆయన కోరారు. వారి ప్రణాళికలను అర్థం చేసుకుని ఎదుర్కోవాలని చెప్పారు. ఈ వ్యాఖ్యల్లో ఆయన అమెరికా, ఇజ్రాయెల్‌ను ఉద్దేశించినట్లు స్పష్టమవుతోంది.

ఇటీవల జరిగిన యుద్ధంలో ఇరాన్.. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనల తర్వాత ఆయా దేశాలతో ఇరాన్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

ఇరాన్‌లోనూ ప్రజలు, అధికారులు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక్కటిగా ఉండాలని ఖమేనీ కోరారు. ఇరాన్ ప్రజలు తమ మధ్య ఎలాంటి విభేదాలు పెరగకుండా చూసుకోవాలి అని ఆయన అన్నారు. సమాజంలో ఐక్యత దెబ్బతినేలా చేసే ఏ చర్యనైనా అనుమతించబోమని శుక్రవారం ఇచ్చిన మరో సందేశంలోనూ ఖమేనీ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై కూడా ఖమేనీ కీలక సూచనలు చేశారు. అమెరికా ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధం కారణంగా ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్న నేపథ్యంలో.. క్రమంగా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించాలని సూచించారు. దేశంలో ఉత్పత్తిని పెంచి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవనంపై ప్రభావం చూపుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఉత్పత్తి, ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు.

మొజ్తబా ఖమేనీ తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన సమయంలో మరణించిన తర్వాత అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. ఆయనకు సంబంధించిన వీడియో లేదా ఆడియోను కూడా ఇరాన్ అధికారులు విడుదల చేయలేదు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.