
Red Sea Attack: ఎర్ర సముద్రంలో భారతీయ సరుకు రవాణా నౌకపై క్షిపణి దాడి జరిగింది. ఈ భయానక దాడి కారణంగా భారత జెండాతో ప్రయాణిస్తున్న నౌక నీటిలో బోల్తా పడి పూర్తిగా మునిగిపోయింది. అయితే అందులో ప్రయాణిస్తున్న 13 మంది భారతీయ నావికులతో పాటు మరొక యెమెన్ పౌరుడిని యెమెన్ రక్షణ దళాలు రక్షించాయి.
Also Read : ఉక్రెయిన్ వీధుల్లో రష్యన్ డ్రోన్ హంటింగ్.. వ్యాపారిని వెంటాడిన డ్రోన్లు.. ఎలా ఎటాక్ చేస్తాయంటే?
#Breaking
🚨#Indian vessel sinks after #RedSea attack off #Yemen Indian government:All 14 crew members have been rescued
An Indian vessel sank after coming under attack in the Red Sea by an explosives-laden boat off Yemen’s western coast, with all 14 crew members rescued,… pic.twitter.com/oqv7aaYWoq
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) August 4, 2026
యెమెన్ దేశంలోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న హోడెడా ఓడరేవు నగరానికి సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎస్‌వి ఫైజ్ నూరే ఒలియా అనే భారతీయ కార్గో నౌక ఎర్ర సముద్రం గుండా ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ప్రక్షేపకం వచ్చి ఢీకొట్టింది. ఈ దాడికి హౌతీ గ్రూపే కారణమని యెమెన్ జాతీయ ప్రతిఘటన దళం స్పష్టం చేసింది. దాడి సమాచారం అందుకున్న వెంటనే యెమెన్ తీరరక్షక దళం, నావికాదళం సంయుక్తంగా అత్యవసర ఆపరేషన్ చేపట్టి నావికులందరినీ సురక్షితంగా రక్షించి.. మోఖా ఓడరేవుకు తరలించి వైద్య సహాయం అందించాయి.
Also Read : ట్రంప్‌ను చంపాకే నేను చస్తా.. ఖమేనీ శపథం.. సుప్రీం లీడర్ అయ్యాక తొలి కీలక మీటింగ్!
నావికులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై కారణం లేకుండా దాడి చేయడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ స్పందిస్తూ.. మన నావికుల భద్రతే భారతదేశానికి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. డైరెక్టర్ జనరల్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో మాట్లాడి రక్షించిన భారతీయులకు కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం యెమెన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తోందని విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఎర్ర సముద్రం, బాబ్ ఎల్-మండేబ్ జలసంధి ప్రాంతాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు పెరగడం అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద సవాలుగా మారింది. ఏడెన్ గల్ఫ్, హిందూ మహాసముద్రాలను కలిపే ఈ సముద్ర మార్గం ప్రపంచ ఇంధన, సరుకు రవాణాకు అత్యంత కీలకమైనది. గత కొంతకాలంగా ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా, ఇతర వాణిజ్య నౌకలపై దిగ్బంధనాలు పాటిస్తూ దాడులకు తెగబడుతున్నారు.
అంతర్జాతీయ జలమార్గాల్లో నౌకల స్వేచ్ఛాయుత రాకపోకలకు ఆటంకం కలిగించే చర్యలను వెంటనే నిలిపివేయాలని భారత్ విజ్ఞప్తి చేసింది. దౌత్యపరంగా, మానవతా దృక్పథంతో మన నావికుల ప్రాణాలను కాపాడుకోవడం భారతదేశానికి ఎంతో సవాలుగా మారినప్పటికీ ఈ ఘటనలో 13 మంది భారత నావికులు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.









