Iran-India Deal : అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి ఇరాన్‌కు సహాయం చేస్తున్న దేశాలు జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో హెచ్చరించారు. అదే సమయంలో భారత్-ఇరాన్ వాణిజ్య ఒప్పందం గురించిన వార్తలను తోసిపుచ్చారు. ఇరాన్ అణు కార్యక్రమం, ఆదాయ వనరులు, సాయుధ బృందాలు, ప్రపంచ నౌకా రవాణాకు ముప్పు వంటి అంశాలపై వాషింగ్టన్ ఒత్తిడి కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధికారులతో సమావేశమైన తర్వాత రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read : మూడు నదులు డేంజర్లో.. నేపాల్ కు ముంచుకొస్తున్న మరో ముప్పు?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధికారులతో సమావేశమైన తర్వాత ఇరు దేశాల మధ్య కొత్తగా వాణిజ్య ఒప్పందం కుదిరిందంటూ వస్తున్న వార్తలను రూబియో తోసిపుచ్చారు. భారత్, ఇరాన్ మధ్య ప్రస్తుతం అలాంటి వాణిజ్య ఒప్పందం ఏదీ లేదని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇరాన్‌తో దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతున్నాయని.. అవసరమైన సమయాల్లో అమెరికా కూడా నేరుగా చర్చలు జరిపిందని గుర్తుచేశారు. అయితే దౌత్య సంబంధాలు వేరని ఇరాన్‌కు ఆదాయాన్ని సమకూర్చడం వేరని ఆయన హెచ్చరించారు.

ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సాధించకుండా నిరోధించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అమెరికా తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందలేదని రూబియో ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ సంపాదించే సొమ్ము ఉగ్రవాదానికి, ఆయుధాల తయారీకి ఉపయోగపడే ప్రమాదం ఉన్నందున ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తామని చెప్పారు. దారికి రాకపోతే ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేయడంతో పాటు తమ బలగాలను, మిత్రదేశాలను కాపాడుకోవడానికి సైనిక శక్తిని ఉపయోగించడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

ప్రపంచ నౌకా రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆధిపత్యాన్ని చెలాయించనివ్వమని అమెరికా ప్రకటించింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకల భద్రతకు ముప్పుగా మారిన మందుపాతరలను అమెరికా బలగాలు ఇప్పటికే ధ్వంసం చేశాయని.. సముద్ర మార్గాన్ని ఎల్లప్పుడూ తెరిచే ఉంచుతామని రూబియో స్పష్టం చేశారు.

Also Read : 6 రోజుల్లో 100 రెస్క్యూ ఆపరేషన్లు.. ఎవరీ నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ పైలట్!