Masoud Pezeshkian : న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యంలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ప్రపంచ అగ్రనేతలు తరలివస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా త్వరలోనే రానున్నారు. అయితే వీరందరికంటే ఎక్కువగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ రాకపైనే ప్రపంచమంతా ఎదురు చూస్తోంది.

పెజెష్కియాన్ భారతదేశానికి వస్తుండటం ఇదే మొదటిసారి కాగా.. ఆయన ప్రయాణించే విమానం రూట్, దాని చుట్టూ ఉన్న భద్రతా ముప్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధ వాతావరణంలో ఉంది. సెప్టెంబర్ ప్రారంభం నుండి ఇరువైపులా దాడులు, ప్రతీకార చర్యలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో దేశాధ్యక్షుడి విమానంలో ప్రయాణించడం కష్టమని, భద్రతా ప్రమాదాలు పొంచి ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.

Also Read : అమెరికా ఎన్నికల్లో ఓటు వేసేందుకు యత్నం: భారతీయుడిపై కేసు

మసూద్ పెజెష్కియాన్ విమానం టెహ్రాన్ నుంచి బయలుదేరి పాకిస్తాన్ గగనతలం గుండా భారతదేశంలోని ఢిల్లీ పాలం వైమానిక దళ కేంద్రానికి చేరుకోవాలి. నేడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ విమానం ఢిల్లీలో ల్యాండ్ కావడానికి షెడ్యూల్ చేశారు. అయితే విమానం ఇరాన్ గగనతలం నుంచి బయటకు రావడం అనేది ప్రమాదమని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. ఇంకా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుండటంతో టెహ్రాన్ పరిసరాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇరాన్ గగనతలంలోకి వచ్చిన వెంటనే అమెరికా టార్గెట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఇరాన్ సరిహద్దులు దాటిన తర్వాత విమానం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం ఇరాన్-పాకిస్తాన్ మధ్య రాజకీయ సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. గతంలో కూడా పెజెష్కియాన్ విమానానికి పాకిస్తాన్ యుద్ధ విమానాలు రక్షణ కల్పించాయి. సాధారణంగా భారతీయ విమానాలకు పాకిస్తాన్ తమ గగనతలాన్ని మూసివేసినప్పటికీ.. ఇతర దేశాల అధినేతల వీవీఐపీ విమానాలకు ఆ ఆంక్షలు వర్తించవు. కాబట్టి పాక్ మార్గం గుండా రావడంలో పెద్దగా ఇబ్బందులు లేవు.

ఇరాన్ అధ్యక్షుడి విమాన భద్రతపై ఇన్ని అనుమానాలు రావడానికి గల కారణం గతంలో ఆయనకు ఎదురైన వరుస బెదిరింపులే. జూన్ 2025లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో పెజెష్కియాన్ స్వల్పంగా గాయపడ్డారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా-ఇరాన్ చర్చల అనంతరం తిరిగొస్తున్న ఇరాన్ ప్రతినిధి బృందం విమానాన్ని పేల్చేస్తామని బెదిరింపులు వచ్చాయి. అప్పుడు అతను ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాల్సి వచ్చింది.

అంతేకాకుండా సెప్టెంబర్ 1న SCO సదస్సు ముగించుకుని కిర్గిజ్‌స్థాన్ నుంచి టెహ్రాన్ వస్తున్న పెజెష్కియాన్ విమానం ‘IRAN02’ హఠాత్తుగా రూట్ మార్చి ఉత్తర ఇరాన్‌లోని రాష్ట్ నగరంలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత రోజు టెహ్రాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థలు యాక్టివ్ అవ్వడం, పేలుళ్లు జరగడం సంచలనం సృష్టించింది. ఈ పరిణామాలన్నీ ఇరాన్ అధ్యక్షుడి విమానంపై శత్రు దేశాల నిఘా ఏ క్షణమైనా ఉండవచ్చనే అనుమానాలను బలపరుస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడి విమానం భారత గగనతలంలోకి ప్రవేశించగానే పూర్తి భద్రతా బాధ్యతలను భారత వైమానిక దళం, కేంద్ర నిఘా వర్గాలు తీసుకుంటాయి. వీవీఐపీ విమానానికి అవసరమైన ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్, మార్గమధ్యంలో రక్షణ ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.

Also Read : పాకిస్తాన్ నకిలీ బాంబులు.. బంగ్లాదేశ్ ట్యాంక్ బ్లాస్ట్.. ఇద్దరు సైనికులు దుర్మరణం.. అసలేమైందంటే?