ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రభుత్వం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధిని వెంటనే ఓపెన్ చేశారు. అయితే ఈ మార్గం గుండా ప్రయాణించే అన్ని అంతర్జాతీయ నౌకలపై ఇరాన్ ఇప్పుడు కఠినమైన ఆంక్షలు విధించింది. ఇకపై ముందస్తు అనుమతులు, బీమా లేనిదే ఏ నౌకనూ తమ సముద్ర సరిహద్దుల్లోకి అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది.

ఈ కొత్త నిబంధనలను పర్యవేక్షించడానికి, కఠినంగా అమలు చేయడానికి ఇరాన్ ప్రభుత్వం తాజాగా పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ అనే కొత్త అధికారిక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య కుదిరిన అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగానే ఈ ప్రత్యేక సంస్థ ఏర్పాటు అయ్యింది. రెండు దేశాల మధ్య ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వచ్చాయి. దీనికోసం ఇరాన్ ఒక అధికారిక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ సముద్ర మార్గంలోకి ప్రవేశించాలనుకునే ప్రతి వాణిజ్య నౌక కూడా ఆ వెబ్‌సైట్‌లో తమ పూర్తి వివరాలను ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది.

ఏ దేశానికి చెందిన ఓడ యజమాని లేదా ఆపరేటర్ అయినా సరే తమ ఇష్టానుసారంగా ఈ జలసంధిలోకి ప్రవేశించడానికి వీల్లేదని వెల్లడించింది. నౌకలు హోర్ముజ్ జలసంధి సరిహద్దుల్లోకి రావడానికి కనీసం 48 గంటల ముందే ఇరాన్ కొత్త అథారిటీకి సమాచారం అందిస్తూ ట్రాన్సిట్ అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. సరైన అనుమతి పత్రాలు, చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేని నౌకలను సరిహద్దుల వద్దే నిలిపివేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీనివల్ల అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

గత మూడు నెలలుగా ఈ సముద్ర ప్రాంతంలో జరిగిన సైనిక సంఘర్షణల వల్ల సముద్ర గర్భంలో ల్యాండ్‌మైన్‌లు లేదా ఇతర ప్రాణాంతక ముప్పులు ఉండే ప్రమాదం ఉందని ఇరాన్ పేర్కొంది. ఈ కారణంగానే ప్రమాదాలను నివారించేందుకు తాము నిర్దేశించిన ప్రత్యేక సురక్షిత కారిడార్ల ద్వారా మాత్రమే నౌకలు ప్రయాణించాలని కండిషన్ పెట్టింది. ఒకవేళ ఏ నౌక అయినా ఈ రూట్లను కాదని వేరే మార్గంలో వెళ్తే.. అక్కడ జరిగే ప్రమాదాలకు లేదా నష్టాలకు ఓడ యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని ఇరాన్ హెచ్చరించింది.