దశాబ్దాలుగా ఇజ్రాయెల్ రాజకీయాన్ని ఏలుతున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కుర్చీకి ఇప్పుడు పెద్ద పరీక్ష ఎదురవుతోంది. ఈ ఎన్నికల్లో ఆయన మళ్లీ గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా విపక్షాల దెబ్బకు గద్దె దిగుతారా అనే ఉత్కంఠ అంతటా నెలకొంది. 2023లో జరిగిన హమాస్ భయంకరమైన దాడి ఆ తర్వాత దేశంలో చెలరేగిన నిరసనల నడుమ ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ప్రజలు నెతన్యాహు పాలనపై ఎలాంటి తీర్పు ఇస్తారనేది అందరూ ఎదురు చూస్తున్నారు.

Also Read : మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్‌లు.. హైదరాబాద్ టెక్కీలపై బిగ్ ఎఫెక్ట్ పడనుందా?

ఇజ్రాయెల్ పార్లమెంటును ‘కనెసెట్’ అని పిలుస్తారు, ఇందులో మొత్తం 120 సీట్లు ఉంటాయి. ఈ పార్లమెంట్ పదవీకాలం 4 ఏళ్లు. ఇక్కడి ఎన్నికల పద్ధతి చాలా సులభం. మనదేశంలా విడివిడి నియోజకవర్గాలు ఉండవు, దేశమంతా ఒకే నియోజకవర్గంగా భావిస్తారు. ప్రజలు ఏ వ్యక్తికి డైరెక్ట్‌గా అసలు ఓటు వేయరు, నేరుగా తమకు నచ్చిన రాజకీయ పార్టీకి ఓటు వేస్తారు. అయితే ఈ మొత్తం ఓట్లలో కనీసం 3.25% ఓట్లు సాధించిన పార్టీలకే పార్లమెంట్‌లో స్థానాలు ఇస్తారు. ఏ పార్టీకైనా ఈ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు ఉండాలి.

1996 నుండి ఇప్పటివరకు దాదాపు 19 ఏళ్లపాటు ప్రధానిగా పనిచేసిన ఘనత నెతన్యాహు సొంతం. ఆయన నాయకత్వంలోని ‘లికుడ్’ పార్టీ ఎలాగైనా మళ్లీ గెలవాలని చూస్తోంది. అయితే ఈసారి నెతన్యాహును ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు గట్టిగా పనిచేస్తున్నాయి. మాజీ మిలిటరీ చీఫ్ గడీ ఐసెన్‌కోట్, మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ వంటి బలమైన నాయకులు ఏకమై నెతన్యాహుకు సవాల్ విసురుతున్నారు.

యుద్ధ వాతావరణం, భద్రతా సమస్యల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు కేవలం ఇజ్రాయెల్‌కే కాకుండా మొత్తం మధ్యప్రాచ్య ప్రాంతానికే చాలా ముఖ్యం. నెతన్యాహు విజయం సాధించి మళ్లీ ప్రధాని అవుతారా లేక ఇజ్రాయెల్ ప్రజలు కొత్త నాయకుడికి అవకాశం ఇస్తారో చూడాలి.

Also Read : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. అయిష్టం చూపిస్తున్న ఓటర్లు.. కారణమిదే!