
Khamenei’s funeral : ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లతో ఇరాన్ దేశమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎటు చూసినా శోకసంద్రమే కనిపిస్తోంది. తమ ప్రియతమ నేతకు చివరిసారిగా నివాళులర్పించేందుకుఇరాన్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇరాన్ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తరలివస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా, ఇందుకు సంబంధించిన భావోద్వేగ దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా విడుదల చేసింది. తమ నేత శవపేటికను తాకడం కోసం మహిళలు, పురుషులు తమ స్కార్ఫ్‌లను శవపేటిక వైపు విసురుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
WATCH: Iran’s Ghalibaf cries during the farewell ceremony of late Supreme Leader Ali Khamenei. pic.twitter.com/3G1i7Fowxl
— Clash Report (@clashreport) July 3, 2026
అక్కడ కనిపించిన దృశ్యాలన్నింటిలోనూ అత్యంత హృదయవిదారకమైన దృశ్యం ఒకటి అందరినీ కన్నీరు పెట్టించింది. నివాళులర్పించడానికి ఉంచిన శవపేటికలలో ఖమేనీతో పాటు ఆయన అల్లుడు, పెద్ద కుమార్తె, ఇరాన్ కొత్త లీడర్ మోజ్తబా ఖమేనీ భార్య, అలాగే కేవలం 14 నెలల వయసున్న ఆయన మనవరాలి శవపేటిక కూడా ఉన్నాయి. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ఖమేనీ శవపేటికకు అతి సమీపంలోనే ఆ చిన్నారి శవపేటికను ఉంచారు. ఆ చిన్నారి శవపేటికను చూసి ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. గతంలో అమెరికా దాడిలో మరణించిన వారి చిత్రాలను కూడా ఆ శవపేటికల ముందు ఉంచినట్లు ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడిలో సుప్రీం లీడర్‌తో సహా పలువురు మరణించిన సంగతి తెలిసిందే.
కన్నీరు పెట్టుకున్న అధ్యక్షుడు పెజెష్కియాన్
ఈ శవపేటికలను తుది సందర్శన కోసం ఉంచిన ‘గ్రాండ్ మొసల్లా’ ప్రార్థనా స్థలంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. ఆయనతో పాటు ఇరాన్ సైన్యానికి చెందిన పలువురు జనరల్స్ సైతం తమ ప్రియతమ నాయకుడిని తలచుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి నివాళులర్పిస్తూ, శవపేటికలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. అందరి కళ్లల్లోనూ తమ ప్రియతమ నాయకుడిని కోల్పోయిన బాధ స్పష్టంగా కనిపించింది.
ఖమేనీ శవపేటికపై తెల్లటి అక్షరాలతో ‘హుస్సేన్’ అని రాసి ఉన్న ఎరుపు రంగు జెండాను కప్పారు. ఇస్లాంలో ఇది అత్యంత పవిత్రమైన వాక్యంగా భావిస్తారు. కర్బలాలోని ఇమామ్ హుస్సేన్ మజార్ (సమాధి) పై ఈ ఎరుపు రంగు జెండా ఎగురుతుంటుంది. అలాగే శవపేటికపై ఖమేనీ ధరించే సాంప్రదాయ పగడీని కూడా ఉంచారు. ఇరాన్ అధికారికంగా శనివారం నాడు ఆయనకు తుది నివాళులర్పించనుంది. ప్రస్తుతం టెహ్రాన్ నగరం అంతటా ఖమేనీ పోస్టర్లు వెలిశాయి. తమ దేశాన్ని దశాబ్దాల పాటు నడిపిన వీరుడికి ఇరాన్ ప్రజలు అత్యంత భారమైన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నారు.మరోవైపు ఇరాన్ మహిళలు సైతం ఖమేనీకి నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అక్కడ ఉన్న శవపేటికలను చూసి మహిళలు తమ దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్, 86 ఏళ్ల అయాతొల్లా ఖమేనీతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విపత్తు జరిగిన దాదాపు నాలుగు నెలల తర్వాత, ఇప్పుడు వారి అంతిమ సంస్కారాలకు సంబంధించిన అధికారిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇరాన్, ఇరాక్ దేశాల్లోని మొత్తం ఐదు ప్రధాన నగరాల్లో ఏడు రోజుల పాటు అత్యంత భారీ స్థాయిలో ఈ అంత్యక్రియల కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం, ఖమేనీ పార్థివ దేహాన్ని ఈ నెల 9వ తేదీన ఇరాన్‌లోని ఆయన సొంత పట్టణమైన ‘మషహద్’లో అధికారిక లాంఛనాలతో ఖననం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన భౌతికకాయాన్ని ప్రజల తుది సందర్శనార్థం ఉంచగా, తమ ప్రియతమ నేతకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. అయితే ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త, భావోద్వేగ వాతావరణం కనిపించింది. తమ నేత మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామనే సంకేతంగా ప్రజలంతా చేతుల్లో ఎర్రజెండాలను పట్టుకుని, ‘డెత్ ఆఫ్ అమెరికా’ (అమెరికా నశించాలి) అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఖమేనీతో కలిసి దశాబ్దాలుగా అత్యంత సన్నిహితంగా పనిచేసిన ఇరాన్ అగ్రనాయకులు, సైనిక అధికారులు ఆయన భౌతికకాయాన్ని చూసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగెర్ ఘాలిబఫ్‌లు ఖమేనీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ సర్వోన్నత నాయకుడిని కోల్పోవడంతో ఇరాన్ అంతటా ప్రస్తుతం తీవ్ర శోకసంద్రం, అదే సమయంలో అమెరికాపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.









