
Pakistan : పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక సీనియర్ కమాండర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడిని లష్కరే కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్‌గా గుర్తించారు. అతను ఓ కొత్త రెస్టారెంట్‌లో భోజనం తిన్న కొన్ని గంటలకే, ఇస్లామాబాద్‌లోని కుబా మసీదు వద్ద నమాజ్ చేయడానికి వెళ్లాడు. అయితే మసీదు గేటు వద్దకు రాగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కాగా ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
మృతి చెందిన ఖారీ సయీద్ లష్కరే తొయిబా సంస్థలో అత్యంత కీలక పాత్ర పోషించేవాడు. జమ్మూ కాశ్మీర్‌లో భారత బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థికంగా, ఇతర రకాలుగా సహాయం అందించే బాధ్యతలను ఈయనే పర్యవేక్షించేవాడు. పాకిస్తాన్‌లో ఇతని అకస్మాత్తు మరణం ఇప్పుడు ఉగ్ర వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇతని మరణం ఇటీవల వచ్చిన ధురంధర్ సినిమాను పోలి ఉండటం మరింత హాట్ టాపిక్ గా మారింది. దురంధర్ తరహాలో భారత ఏజెన్సీల ఆపరేషన్ జరిగిందా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read : సీటు బెల్టు పెట్టుకోనన్న చిన్నారి… విమాన సర్వీస్‌ను రద్దు చేసిన సిబ్బంది
2008 ముంబై 26/11 దాడుల కుట్రలో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ సాధారణ వ్యక్తి కాదు, లష్కరే తోయిబా సంస్థలో అత్యంత కీలక స్థాయిలో పనిచేసిన ముఖ్యమైన ఆపరేటివ్ అని భద్రతా సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్లలో చనిపోయిన లష్కరే ఉగ్రవాదుల కుటుంబాల సంక్షేమాన్ని, వారికి ఆర్థిక సాయం అందించే విభాగాన్ని అజీజ్ దగ్గరుండి పర్యవేక్షించేవాడు. అలాంటి అగ్రశ్రేణి ఉగ్రవాది ఎలాంటి కాల్పులు లేదా భౌతిక దాడుల ఆనవాళ్లు లేకుండా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.
ఈ సంఘటన వెలుగులోకి రావడంతో పాకిస్తాన్ గడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న కీలక ఉగ్రవాదులు వరుసగా అనుమానాస్పద రీతిలో శవమై తేలడంపై మరోసారి జోరుగా చర్చ మొదలైంది. అబ్దుల్ అజీజ్ ది సాధారణ అనారోగ్య మరణమా, విషప్రయోగమా లేదా ఏదైనా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన టార్గెట్ ఆపరేషనా అనేది తెలియాలంటే పోస్టుమార్టం, టాక్సికాలజీ ఫోరెన్సిక్ రిపోర్టులు, అతడు ఆఖరిగా భోజనం చేసిన ప్రదేశానికి చెందిన సీసీటీవీ ఫుటేజ్ దర్యాప్తు వివరాలు బయటకు రావాల్సి ఉంది.
Also Read : హర్మూజ్‌లో మరోసారి ఉద్రిక్తత…ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి..









