Mecca Defence Pact FAIL
Mecca Defence Pact FAIL

ఒక్క దేశంపై దాడి జరిగితే మూడు దేశాలపై దాడి జరిగినట్టే..!. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్‌. ఈ మూడు దేశాలు కలిసి చేసిన ప్రకటన ఇది. ఆగస్టు 7న మక్కాలో కుదిరిన డిఫెన్స్‌ ప్యాక్ట్‌ కూడా ఇదే చెబుతోంది. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై అటాక్స్ జరిగినా అది ముగ్గురిపై దాడిగా పరిగణించాలి. అంటే సౌదీపై దాడి జరిగితే టర్కీ, పాకిస్థాన్‌ కూడా దాన్ని తమపై దాడిగానే చూడాలి. అంతే కాదు మూడు దేశాలు కలిసి డిఫెన్స్‌ కోఆపరేషన్‌ పెంచుకోవాలి. జాయింట్‌ మిలిటరీ యాక్టివిటీస్‌ చేయాలి. డిఫెన్స్‌ టెక్నాలజీని డెవలప్‌ చేయాలి. అవసరమైతే మిలిటరీ సామర్థ్యాలను కూడా కలిపి ఉపయోగించాలి. అందుకే మక్కా డిఫెన్స్‌ ప్యాక్ట్‌ను చాలామంది NATOలోని ఆర్టికల్‌ 5తరహా ఒప్పందంగా చూస్తున్నారు. అయితే ఈ ఒప్పందం కుదిరి నెల రోజులు కూడా కాలేదు. సౌదీ అరేబియాపై భారీ దాడి జరిగింది. సెప్టెంబర్‌ 8 యెమెన్‌కు చెందిన హౌతీలు సౌదీలోని పలు ప్రాంతాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేశారు.

అబ్హా, జిజాన్‌, నజ్రాన్‌, ఖమీస్‌ ముషైత్‌ ఒకేసారి పలు ప్రాంతాల్లో హౌతీ దళాలు విరుచుకుపడ్డాయి. అరామ్‌కోకు చెందిన ఎనర్జీ ఫెసిలిటీలపైనా దాడులు జరిగాయి. జిజాన్‌లోని రిఫైనరీ కూడా అటాక్‌కు గురైంది. హౌతీల దాడుల్లో 73 మంది వరకు గాయపడ్డారు. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని ఎనర్జీ ఫెసిలిటీల్లో మంటలు చెలరేగాయి. కొన్ని చోట్ల ఆపరేషన్స్‌ తాత్కాలికంగా నిలిచిపోయాయి. అంటే ఇది సాధారణ డ్రోన్‌ అటాక్‌ కాదు. సౌదీ భద్రతపై దాడి, సౌదీ ఆయిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడి, సౌదీ ఎకానమీకి కీలకమైన ఎనర్జీ సెక్టార్‌పై దాడి. అందుకే ఇప్పుడు ఒక్కటే ప్రశ్న. మక్కా డిఫెన్స్‌ ప్యాక్ట్‌ ఏం చేస్తుంది?.. టర్కీ ఏం చేస్తుంది?.. పాకిస్థాన్‌ ఏం చేస్తుంది?. ఎందుకంటే ఒప్పందం ప్రకారం ఒకరిపై దాడి అంటే అందరిపై దాడి. కానీ ఇప్పటివరకు కనిపిస్తున్నది ఏంటి?.. స్టేట్‌మెంట్లు మాత్రమే. ఖండనలు మాత్రమే. సౌదీకి మద్దతు అనే మాటలు మాత్రమే.

కానీ.. డైరెక్ట్‌ మిలిటరీ యాక్షన్‌ ఎక్కడా కనిపించడం లేదు. ఇక్కడే అసలు స్టోరీ ఉంది. అసలు మక్కా ప్యాక్ట్‌ ఏంటి?. ముందుగా ఈ ఒప్పందం ఎందుకు కుదిరిందో చూద్దాం. సౌదీ అరేబియా చాలాకాలంగా తన భద్రత కోసం అమెరికా మీద భారీగా ఆధారపడుతోంది. అమెరికా ఆయుధాలు, అమెరికా మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌, అమెరికా మిలిటరీ సపోర్ట్‌, ఇవన్నీ సౌదీ భద్రతలో కీలకంగా ఉన్నాయి. కానీ పశ్చిమాసియాలో పరిస్థితులు మారుతున్నాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతలు, యెమెన్‌లో హౌతీల ముప్పు, రెడ్‌ సీ షిప్పింగ్‌ సమస్యలు, మిస్సైళ్లు, డ్రోన్లు ఇవన్నీ సౌదీకి కొత్త సెక్యూరిటీ ఛాలెంజెస్‌. అందుకే సౌదీ ఇప్పుడు తన భద్రత కోసం ఒక్క అమెరికాపైనే ఆధారపడకుండా.. రీజినల్‌ పార్ట్‌నర్స్‌తో కూడా డిఫెన్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవాలని చూస్తోంది. అక్కడే టర్కీ, పాకిస్థాన్‌ ఎంట్రీ ఇచ్చాయి.

టర్కీ దగ్గర బలమైన డిఫెన్స్‌ ఇండస్ట్రీ ఉంది. డ్రోన్లు, మిస్సైల్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌, అన్‌మ్యాన్డ్‌ సిస్టమ్స్‌, ఇలాంటి రంగాల్లో టర్కీ వేగంగా ఎదుగుతోంది. ఇక పాకిస్థాన్‌ పెద్ద సైనిక వ్యవస్థ ఉన్న దేశం. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ముస్లిం దేశం. సౌదీతో పాకిస్థాన్‌కు ఇదివరకే సైనిక సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈ మూడు దేశాలు కలిస్తే.. డబ్బు ఒకవైపు, టెక్నాలజీ ఒకవైపు, మిలిటరీ అనుభవం మరోవైపు.. మూడు బలాలు ఒకే చోటికి వస్తాయి. అయితే హౌతీలు ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?. ఇక్కడ మరో స్టోరీ ఉంది. యెమెన్‌లో హౌతీలు బలమైన సాయుధ గ్రూప్‌. వారికి ఇరాన్‌ మద్దతు ఉంది. సౌదీ, హౌతీల మధ్య ఎప్పటినుంచో శతృత్వం ఉంది. 2015 నుంచి సౌదీ నేతృత్వంలోని కూటమి యెమెన్‌లో హౌతీలకు వ్యతిరేకంగా సైనిక చర్యలు చేపట్టింది. 2022లో ఒక కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులు కొంత కూల్‌ అయ్యాయి. కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితులు వేడెక్కుతున్నాయి.

Also Read : జెలెన్‌స్కీ విమానానికి డ్రోన్ ముప్పు.. తృటిలో తప్పిన ప్రమాదం!

హౌతీలు మళ్లీ సౌదీని టార్గెట్‌ చేస్తున్నారు. వాళ్ల మెసేజ్‌ క్లియర్‌.. యెమెన్‌పై సౌదీ దాడులు ఆపకపోతే సౌదీని కూడా టార్గెట్‌ చేస్తాం. అదే సమయంలో సౌదీ మాత్రం హౌతీల దాడులను తమ దేశంపై దాడిగా చూస్తోంది. అంటే.. ఇది కేవలం యెమెన్‌-సౌదీ గొడవ కాదు. ఇది మళ్లీ పెద్ద రీజినల్‌ సంఘర్షణగా మారే ప్రమాదం ఉంది. మరి పాకిస్థాన్‌ ఎందుకు వెంటనే రంగంలోకి రాలేదు?. ఇదే ఇప్పుడు అందరి ప్రశ్న. మక్కా ప్యాక్ట్‌ కుదిరింది.. ఒకరిపై దాడి అంటే అందరిపై దాడి అన్నారు. సౌదీపై దాడి కూడా జరిగింది. అయితే పాకిస్థాన్‌ సైన్యం ఎక్కడ?.. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. డిఫెన్స్‌ ప్యాక్ట్‌ అంటే వెంటనే యుద్ధంలోకి దిగాల్సిందే అని కాదు. అసలు ఒప్పందంలో ఏం ఉన్నాయో పూర్తిగా బయటకు రాలేదు. అసలు ఎలాంటి దాడిని ఆర్టికల్‌ 5 తరహా దాడిగా చూస్తారు?, దానికి ఎలాంటి మిలిటరీ రెస్పాన్స్‌ ఇవ్వాలి?, అవసరమైతే ఎయిర్‌ డిఫెన్స్‌ ఇవ్వాలా?, సైనికులను పంపాలా?, ఇంటెలిజెన్స్‌ షేర్‌ చేయాలా?, ఇలాంటి విషయాలన్నీ పరిస్థితిని బట్టి మూడు దేశాలు కలిసి నిర్ణయించే అవకాశం ఉంది.

అందుకే పాకిస్థాన్‌ వెంటనే యుద్ధంలోకి దిగలేదని.. అందువల్లే మక్కా ప్యాక్ట్‌ ఫెయిల్‌ అయిందని చెప్పలేం. కానీ పాకిస్థాన్‌కు మాత్రం ఇప్పుడు ఒక పెద్ద డైలెమా ఉంది. సౌదీకి పూర్తిగా అండగా నిలబడాలి. కానీ హౌతీలతో యుద్ధంలోకి దిగితే దాని ప్రభావం ఇరాన్‌తో సంబంధాలపై పడొచ్చు. మరోవైపు పాకిస్థాన్‌ కూడా తన దేశ భద్రతపైనే దృష్టి పెట్టాల్సి ఉంది. అందుకే నేరుగా యుద్ధంలోకి దిగడం ఇస్లామాబాద్‌కు అంత ఈజీ కాదు. మరి టర్కీ ఎందుకు సైలెంట్‌గా ఉంది?. టర్కీ పరిస్థితి కూడా అంతే. సౌదీతో టర్కీకి ఉన్న రిలేషన్ మరింత బలపడుతోంది. మక్కా ప్యాక్ట్‌ ద్వారా ఆ సంబంధాలు మరింత స్ట్రాంగ్‌ అయ్యాయి. కానీ టర్కీకి మరో లెక్క ఉంది. టర్కీ NATO సభ్యదేశం. అమెరికాతో దానికి రక్షణ సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో ఇరాన్‌తో కూడా పూర్తిగా శత్రుత్వం కోరుకోవడం లేదు.

మిడిల్‌ఈస్ట్‌లో టర్కీకి తన సొంత రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి సౌదీకి సపోర్ట్‌ చేయడం ఒకటి.. హౌతీలపై నేరుగా యుద్ధం చేయడం మరొకటి. అందుకే టర్కీ ఇప్పటివరకు సౌదీకి మద్దతు ప్రకటిస్తూ.. హౌతీల దాడులను ఖండిస్తూ.. డిప్లమాటిక్‌ లైన్‌లోనే ఉంది. అయితే మక్కా ప్యాక్ట్‌ ఉపయోగం ఏంటి?.. ఇక్కడే అసలు పాయింట్‌. ఈ ప్యాక్ట్‌ ఉద్దేశం కేవలం “దాడి జరిగితే యుద్ధం చేయడం” మాత్రమే కాదు. దాడి చేయాలంటే ముందే ప్రత్యర్థి భయపడేలా చేయడం. అదే నిరోధకత.

ఉదాహరణకు.. హౌతీలు సౌదీపై దాడి చేయాలనుకుంటే “సౌదీతో మాత్రమే యుద్ధం కాదు.. టర్కీ కూడా రావచ్చు.. పాకిస్థాన్‌ కూడా రావచ్చు..” అనే భయం ఉండాలి. అలా ఉంటే దాడి చేసే ముందు ప్రత్యర్థి రెండు, మూడుసార్లు ఆలోచిస్తారు. అదే ఈ ప్యాక్ట్‌ అసలు బలం. కానీ ఇప్పుడు వరుసగా దాడులు జరిగితే.. ఈ డిటరెన్స్‌ బలహీనపడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రత్యర్థికి ఒక క్లియర్‌ మెసేజ్‌ వెళ్లొచ్చు. “దాడులు జరిగితే.. ఖండనలు వస్తాయి. కానీ వెంటనే మిలిటరీ యాక్షన్‌ ఉండదు.” ఇదే మక్కా ప్యాక్ట్‌కు పెద్ద సమస్యగా మారొచ్చు. మరి.. ప్యాక్ట్‌ ఫెయిల్‌ అయిందా?. నో.. ఇప్పుడే అలా చెప్పలేం. ఎందుకంటే.. ఇది మక్కా ప్యాక్ట్‌కు వచ్చిన మొదటి పెద్ద పరీక్ష.

ఎందుకంటే.. ఈ ప్యాక్ట్‌ కుదిరి నెల రోజులు కూడా కాలేదు. అంతేకాదు ఆగస్టు 31న మూడు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు, టాప్‌ మిలిటరీ కమాండర్లు సమావేశమయ్యారు. మూడు దేశాల మధ్య శాశ్వత సెక్రటేరియట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జాయింట్‌ డిఫెన్స్‌ యాక్టివిటీస్‌ పెంచాలని చెప్పారు. డిఫెన్స్‌ ఇండస్ట్రీలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. జాయింట్‌ టెక్నాలజీ, జాయింట్‌ ప్రొడక్షన్‌ గురించి మాట్లాడారు. అంటే.. ప్యాక్ట్‌ను కాగితంపైనే వదిలేయడం లేదు. దాన్ని ఒక శాశ్వత డిఫెన్స్‌ మెకానిజంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే.. ఇది ఫెయిల్‌ అయిందని చెప్పడం కంటే.. ఇది మొదటి ఫైర్‌ టెస్ట్‌ అని చెప్పడం కరెక్ట్‌. ఇక ముందు ఏం జరగొచ్చు? ఇక్కడ మూడు సీనారియోలు కనిపిస్తున్నాయి.

Also Read : ఐఫుల్ టవర్ దగ్గర మహిళలకు ఘోర అవమానం ?

ఫస్ట్‌.. హౌతీలు దాడులు ఆపేస్తే.. మక్కా ప్యాక్ట్‌ పెద్దగా మిలిటరీ యాక్షన్‌ లేకుండానే తన డిటరెన్స్‌ను చూపించినట్టవుతుంది.

సెకండ్‌.. హౌతీలు మళ్లీ సౌదీ ఆయిల్‌ ఫెసిలిటీలను టార్గెట్‌ చేస్తే.. అప్పుడు టర్కీ, పాకిస్థాన్‌పై ప్రెషర్‌ పెరుగుతుంది. సౌదీ కూడా “మాటల మద్దతు కాదు.. మిలిటరీ సపోర్ట్‌ కావాలి” అని కోరే అవకాశం ఉంది.

థర్డ్‌.. దాడులు మరింత పెరిగితే మిస్సైళ్లు, డ్రోన్లతో పాటు సౌదీకి చెందిన కీలక మిలిటరీ, ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తీవ్రంగా దెబ్బతింటే.. అప్పుడు ఈ ప్యాక్ట్‌ నిజంగా యాక్టివేట్‌ అయ్యే పరిస్థితి రావచ్చు. అప్పుడు టర్కీ ఏం చేస్తుంది?, పాకిస్థాన్‌ ఏం చేస్తుంది? అనేది ప్రపంచం మొత్తం చూస్తుంది.

ఇక్కడ మరో పెద్ద ప్రమాదం ఉంది. ఇది కేవలం సౌదీ సమస్య కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్‌ ప్రొడ్యూసర్లలో సౌదీ ఒకటి. అక్కడి ఆయిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దెబ్బతింటే.. ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌పై ప్రభావం పడుతుంది. ఇప్పటికే సెప్టెంబర్‌ 8 దాడుల తర్వాత బ్రెంట్‌ క్రూడ్‌ ధర దాదాపు 98 డాలర్లకు చేరింది. అంటే.. సౌదీపై ఒక డ్రోన్‌ లేదా మిస్సైల్‌ దాడి కేవలం సౌదీ సమస్య కాదు. అది ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌కు సమస్య.

అక్కడి నుంచి ఇంధన ధరలు, షిప్పింగ్‌ ఖర్చులు, ఇన్సూరెన్స్‌, గ్లోబల్‌ ఇన్‌ఫ్లేషన్‌ ఇవన్నీ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందుకే అమెరికా నుంచి యూరప్‌ వరకు.. ఇండియా నుంచి చైనా వరకు.. అందరూ ఈ పరిణామాలను గమనిస్తున్నారు. మరి మక్కా ప్యాక్ట్‌ ఫ్యూచర్ ఏంటి?.. ఈ ప్యాక్ట్‌ నిజంగా బలమైన డిఫెన్స్‌ అలయన్స్‌గా మారాలంటే.. మూడు విషయాలు జరగాలి.

ఒకటి.. మూడు దేశాల మధ్య జాయింట్‌ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లు పెరగాలి.

రెండు.. ఎయిర్‌ డిఫెన్స్‌, డ్రోన్‌ వార్‌ఫేర్‌, ఇంటెలిజెన్స్‌ షేరింగ్‌లో కోఆర్డినేషన్‌ పెరగాలి.

మూడు.. దాడి జరిగినప్పుడు ఎవరు ఏం చేయాలన్నది స్పష్టంగా ఉండాలి. అది జరిగితేనే మక్కా ప్యాక్ట్‌ ఒక రాజకీయ ప్రకటన నుంచి నిజమైన మిలిటరీ అలయన్స్‌గా మారుతుంది. లేకపోతే ‘ఒకరిపై దాడి.. అందరిపై దాడి’ అనే మాట.. కేవలం స్టేట్‌మెంట్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు.. మక్కా ప్యాక్ట్‌ ఫెయిల్‌ అయిందా? అనే ప్రశ్న కంటే మక్కా ప్యాక్ట్‌ నిజంగా పనిచేస్తుందా? అనే ప్రశ్నే కీలకం. ఎందుకంటే ఒప్పందం కుదుర్చుకోవడం ఈజీ, స్టేజ్‌పై నిలబడి ఫొటోలు దిగడం ఈజీ, ఒకరికి ఒకరు మద్దతు ప్రకటించుకోవడం కూడా ఈజీ, కానీ దాడి జరిగినప్పుడు.. ఎంత దూరం వెళ్తారన్నదే అసలు పరీక్ష. సౌదీపై దాడి జరిగింది.. 73 మంది గాయపడ్డారు.. ఆయిల్‌ ఫెసిలిటీలు టార్గెట్‌ అయ్యాయి.. మంటలు చెలరేగాయి.. సౌదీ రియాక్ట్‌ అవుతోంది.. హౌతీలు వెనక్కి తగ్గడం లేదు.. ఇప్పుడు టర్కీ ఏం చేస్తుంది?, పాకిస్థాన్‌ ఏం చేస్తుంది?. మక్కా ప్యాక్ట్‌ ఎంతవరకు పనిచేస్తుంది? అదే ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. ఎందుకంటే.. మక్కా ప్యాక్ట్‌ బలం దాని సంతకాలలో లేదు. సౌదీపై మరో దాడి జరిగినప్పుడు.. టర్కీ, పాకిస్థాన్‌ తీసుకునే నిర్ణయంలో ఉంది.