
ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సులో జరిగిన ఘటన అమెరికా, ఇటలీ దేశాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. తనతో ఫొటో దిగడం కోసం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ బతిమాలారని, అందుకే తాను ఒప్పుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఇటలీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడంతో సంచలన వివాదం మొదలైంది. అయితే ట్రంప్ అన్న ఈ మాటలపై ఇటలీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనికి నిరసనగా ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని తన అమెరికా పర్యటనను తక్షణమే రద్దు చేసుకున్నారు.
Io e l’Italia non imploriamo mai. pic.twitter.com/sTpKlqWB67
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 19, 2026
ఇటలీ దేశాధ్యక్షుడితో పాటు అక్కడి రాజకీయ నాయకులందరూ మెలోనీకి మద్దతుగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడి వంటి ఉన్నత పదవిలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. ఈ విషయంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా స్పందించారు. స్వయంగా ఆమెనే ఓ వీడియో రిలీజ్ చేసి ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ చెప్పేవన్నీ అబద్ధాలని, అవన్నీ కల్పిత కథలని ఆమె కొట్టిపారేశారు. ఒక మిత్రదేశ ప్రధాని గురించి అమెరికా అధ్యక్షుడు ఇంత చులకనగా మాట్లాడటం తనని షాకింగ్‌కు గురిచేసిందన్నారు. అంతేకాకుండా.. ట్రంప్ తీరును ఎండగడుతూ మెలోనీ తీవ్ర విమర్శలు చేశారు. పాశ్చాత్య దేశాలకు, అలాగే అమెరికాకు శత్రువులుగా ఉన్న దేశాల పట్ల ట్రంప్ ఎప్పుడూ ఇంత కఠినంగా వ్యవహరించరు. వారి విషయంలో ఎప్పుడూ సర్దుకుపోతుంటారు, అది నిజంగా సిగ్గుచేటు. ఆయన ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి.. నేనైనా, నా దేశమైన ఇటలీ అయినా ఎవరి ముందూ మోకరిల్లం, ఎవరినీ బతిమాలం. ఇలాంటి సొంత డబ్బా కథలు చెప్పుకోవడం ట్రంప్‌నకు అలవాటే అని మెలోనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.









