
అమెరికాలో విమానయాన సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో అకస్మాత్తుగా తలెత్తిన కమ్యూనికేషన్ వైఫల్యం కారణంగా అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. ఈ భారీ సాంకేతిక అంతరాయం వల్ల అమెరికా గగనతలం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఫలితంగా సుమారు 10 వేలకు పైగా విమానాలు తీవ్రంగా ఆలస్యం కాగా దాదాపు 6,600కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. విమానయాన రంగంలో పెద్ద కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సంక్షోభానికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన వెలువరించింది. అమెరికా విమానయాన శాఖ ఎదుర్కొన్న ఈ గ్రౌండ్ స్టాప్ సమస్యతో తమ సంస్థకు లేదా తమ క్లౌడ్ సేవలకు ఎలాంటి సంబంధం లేదని మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఇచ్చింది.
ఈ సాంకేతిక వైఫల్యం వెనుక మైక్రోసాఫ్ట్ క్లౌడ్ లేదా సాఫ్ట్వేర్ సేవలు ఏమైనా కారణమై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలో కొన్ని గ్లోబల్ టెక్ లోపాల వల్ల విమానయాన సంస్థలు, బ్యాంకులు, డిజిటల్ నెట్‌వర్క్‌లు తీవ్రంగా దెబ్బతిన్న ఉదాహరణలు ఉండటంతో ఈసారీ మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్‌లో లోపం వల్లే ఇది జరిగి ఉంటుందని అంతా భావించారు. అయితే ఈ వస్తున్న వదంతులను, వార్తలను మైక్రోసాఫ్ట్ తీవ్రంగా ఖండించింది. తమ సిస్టమ్స్, సర్వర్లు లేదా క్లౌడ్ సేవల్లో ఎలాంటి అంతరాయం తలెత్తలేదని ఈ విమానయాన సంక్షోభానికి తమ టెక్నాలజీ కారణమనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. తాము ఈ ఘటనను పరిశీలిస్తున్నామని, ఎఫ్ఏఏ అధికారులకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
ఈ ఘటనపై ఎఫ్ఏఏ అధికారులు, అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అత్యంత సీరియస్‌గా దర్యాప్తు జరుపుతున్నాయి. ప్రాథమిక విచారణలో భాగంగా ఈ సాంకేతిక లోపం వెనుక ఏవైనా సైబర్ దాడిల హస్తం ఉందా అనే కోణంలో అధికారులు ఆరా తీశారు. అయితే ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం ఎటువంటి సైబర్ దాడి జరిగినట్లు నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. కేవలం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లోని అంతర్గత సాంకేతిక లోపం లేదా సాఫ్ట్వేర్ సింక్ కాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయినప్పటికీ ఇంత భారీ స్థాయిలో విమాన సర్వీసులు నిలిచిపోవడం అమెరికా చరిత్రలో అత్యంత అరుదైన ఘటనగా నిలిచింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు చేపట్టినప్పటికీ, విమానాలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.









