
Morocco : స్పెయిన్‌కు చెందిన ఉత్తర ఆఫ్రికా భూభాగమైన సెయుటా సరిహద్దులో భద్రతా బలగాలను ఎదిరించి వేలాది మంది వలసదారులు ఆ దేశంలోకి చొచ్చుకెళ్లారు. 2021 నాటి వలస సంక్షోభం తర్వాత స్పెయిన్ భూభాగంలో జరిగిన అతిపెద్ద సామూహిక ప్రవేశం ఇదే కావడం గమనార్హం. స్పానిష్ అధికారులు ఎలాంటి అధికారిక సంఖ్యను వెల్లడించనప్పటికీ, కేవలం కొన్ని గంటల్లోనే 2,000 నుంచి 3,000 మంది వలసదారులు సెయుటాలోకి ప్రవేశించారు. వీరిలో చాలా మంది సముద్రం ద్వారా రాగా, మరికొందరు మొరాకోను ఆ ప్రాంతం నుంచి వేరు చేసే సరిహద్దు కంచెలను పడగొట్టి లోపలికి వచ్చారు.
ఈ భారీ ప్రవాహం పోలీసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఐరోపా సమాఖ్యకు ఆఫ్రికాతో ఉన్న ఏకైక భూ సరిహద్దు వద్ద వలసల సమస్యపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. వలసదారుల తాకిడి విపరీతంగా పెరగడంతో, సెయుటా ప్రాంతీయ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని, అదనపు బలగాలను మోహరించాలని మాడ్రిడ్‌ను కోరింది. ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసులను దాటుకుని తరాజల్ బ్రేక్‌వాటర్ గుండా వలసదారులు భారీగా సముద్రం ద్వారా ప్రవేశిస్తున్నారు అని స్పెయిన్‌కు చెందిన గార్డియా సివిల్ వెల్లడించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలలో, వలసదారుల గుంపులు గాలి నింపిన ట్యూబ్‌లు, తాత్కాలిక తెప్పలను ఉపయోగించి బ్రేక్‌వాటర్ చుట్టూ ఈదుకుంటూ వస్తున్నట్లు కనిపించింది.
మరికొందరు సరిహద్దు కంచె వద్ద ఉన్న గేటును బలవంతంగా తెరిచి సెయుటాలోకి పరుగులు తీశారు. ఆ ఎన్‌క్లేవ్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో కొందరు స్పెయిన్ వర్ధిల్లు అంటూ నినాదాలు చేయడం వినిపించింది. 2021 మే నెలలో జరిగిన అపూర్వమైన వలస సంక్షోభాన్ని ఈ దృశ్యాలు గుర్తు చేశాయి. ఆ సమయంలో మొరాకో, సబ్-సహారా ఆఫ్రికాకు చెందిన దాదాపు 10,000 మంది వలసదారులు కొద్ది రోజుల్లోనే సెయుటాలోకి ప్రవేశించారు. సమీపంలోని స్పెయిన్ భూభాగమైన మెలిల్లాతో పాటు సెయుటా కూడా ఐరోపా సమాఖ్యకు ఆఫ్రికాతో ఉన్న ఏకైక భూ సరిహద్దుగా ఉంది. అంతేకాకుండా ఐరోపా చేరుకోవాలనుకునే వలసదారులకు ఇది చాలా కాలంగా ప్రధాన కేంద్రంగా మారింది.
Also Read : అమెరికాలో క్షిపణి నిల్వల సంక్షోభం…. ఒత్తిడిలో వాయు రక్షణ వ్యవస్థ ?
వలసదారుల రాక క్రమంగా పెరుగుతుండటంతో, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి, భద్రతను బలోపేతం చేయడానికి సైన్యాన్ని మోహరించాలని, మరిన్ని చొరబాట్లను నిరోధించడానికి మొరాకోతో సరిహద్దును తాత్కాలికంగా మూసివేయాలని సెయుటా అధిపతి జువాన్ జెసెస్ వివాస్ మాడ్రిడ్‌ను కోరారు. అయితే, తక్షణమే సైనిక సిబ్బందిని మోహరించే ప్రణాళికలేమీ లేవని స్పెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సంక్షోభానికి తక్షణ స్పందనను అందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆ తర్వాత ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ స్పందించారు.
వివాస్‌తో మాట్లాడిన తర్వాత సాంచెజ్ స్పందిస్తూ, అవసరమైన అన్ని వనరులను మేము సమీకరిస్తున్నాము, మొరాకో, అంతర్జాతీయ అధికారులతో కలిసి పని చేస్తున్నాము, వీలైనంత త్వరగా సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలను సిద్ధం చేస్తున్నామని రాశారు. నిర్దిష్ట చర్యలను వెల్లడించకుండానే, బాధ్యత, సహకారంతో పరిష్కారాలను నిర్మించుకోవడానికి ఇదే సరైన సమయని ఆయన అన్నారు.
మొరాకో అధికారులతో తాము నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని అంత్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవలి రోజుల్లోనే వేలాది అక్రమ చొరబాటు ప్రయత్నాలను అడ్డుకున్నామని స్పష్టం చేసింది. అక్రమంగా స్పెయిన్‌లోకి ప్రవేశించినట్లు తేలిన వారిని వెంటనే బహిష్కరిస్తామని, మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని ఆరోపించింది.
Also Read : సముద్ర మార్గ వ్యాపార రక్షణ కోసం.. 14 దేశాలతో సౌదీ అరేబియా నావికాదళ కూటమి









