Niger airport attack
Niger airport attack

పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌లో ఘోరం జరిగింది. నియామేలోని దియోరి హమాని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సహా దాని సమీపంలో ఉన్న సైనిక వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. ఈ దారుణ ఘటనలో దాదాపు 13 మంది మృతి చెందారు. అందులో 11 మంది నైజర్ సైనికులు కాగా.. మరో ఇద్దరు సాధారణ పౌరులుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

ఈ దాడిని తామే చేశామంటూ.. అల్ ఖైదాకు అనుబంధంగా ఉన్న జమాత్ నుస్రత్ అల్ – ఇస్లాం వల్ ముస్లిమిన్ అనే ఉగ్రసంస్థ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది. తామే ఈ ఆత్మాహుతి దాడికి ప్లాన్ వేశామని ఆ సంస్థ పేర్కొంది. ఈ దాడి దాదాపు రెండు గంటల పాటు సాగింది. ఉదయం 6 గంటల సమయంలో ఎయిర్‌పోర్టు చెక్ పోస్ట్ వద్దకు ట్యాక్సీలో వచ్చిన కొందరు సాయుధ దుండగులు ఒక్కసారిగా ఆయుధాలతో భీకర దాడులు చేశారు.

దీంతో అలెర్ట్ అయిన నైజర్ సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. కాగా ఉగ్రవాదుల్లో కొందరు ఆత్మాహుతి బాంబు బెల్టులు పెట్టుకుని వచ్చినట్లు నైజర్ సైనిక వర్గాలు తెలిపాయి. ఇక అదే సమయంలో సైనికులు చాకచక్యంగా వ్యవహరించి.. ఎదురు కాల్పులు జరపడంతో 22 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

అలాగే ఘటనాస్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన మరో 20 మంది అనుమానితులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద ఉన్న పదుల సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ సహా సమీప సైనిక స్థావరాల్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని నైజర్ ప్రభుత్వం వెల్లడించింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.