Ballistic Missile : ఉత్తర కొరియా మరోసారి ప్రపంచ దేశాలకు సవాల్‌ విసిరింది. ఎవరిమాట వినని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నేతృత్వంలో కేవలం 3 గంటల వ్యవధిలో.. తమ దేశ తూర్పు తీర ప్రాంతమైన వొన్సాన్‌ నుంచి రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించి కవ్వింపు చర్యలకు దిగింది. కాగా కొరియా పరీక్షించిన తొలి క్షిపణి సుమారు 450 కిలోమీటర్లు ప్రయాణించింది. రెండోది 600 కిలోమీటర్లకుపైగా దూరం వరకు దూసుకెళ్లింది. చివరకు రెండూ కూడ సముద్రంలోనే కూలిపోయాయి. కాగా, ఉత్తర కొరియా చర్యపై దక్షిణ కొరియా. జపాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా వెంటనే బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలు నిలిపివేయాలని డిమాండ్‌ చేశాయి. ఉత్తర కొరియా చేస్తున్న క్షిపణి ప్రయోగాలు తమ దేశ భద్రతకు విఘాతం కలిగిస్తాయని జపాన్‌ కూడా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా గతనెలలో అమెరికా -దక్షిణ కొరియా దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు జరిపాయి.ఈ క్రమంలోనే ఉత్తర కొరియా తాజాగా ఈ క్షిపణులు పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో సమావేశమవుతారని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ఈ క్షిపణి ప్రయోగాలు కొంత తలనొప్పిగా మారాయి.

Also Read : టెక్ దిగ్గజం ఆపిల్‌లో ఉద్యోగాల కోత.. రెండు నెలల్లో రెండోసారి..

కాగా, ఉత్తర కొరియా జరిపిన ఈ వరుస క్షిపణి పరీక్షలు కేవలం సైనిక ప్రదర్శనగా మాత్రమే భావించరాదని.. అంతర్జాతీయ సమాజం, శత్రు దేశాల ఒత్తిడికి ఉత్తర కొరియా ఇస్తున్న ప్రత్యక్ష వార్నింగ్‌ అని భద్రతా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఫలితంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ప్రధాన వాణిజ్య, నౌకా రవాణా మార్గాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కొరియా చర్యతో అప్రమత్తమైన జపాన్, దక్షిణ కొరియాలు తమ రక్షణ సన్నాహాలను సమీక్షిస్తున్నాయి.

కాగా క్షిపణి ప్రయోగం అనంతరం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. అమెరికా నేతృత్వంలో దక్షిణ కొరియాలో జరుగుతున్న సైనిక చర్యలు కొరియా ద్వీపకల్పంలో శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. దేశ రక్షణ కోసం అణ్వాయుధాలను బలపరచడం, క్షిపణి వ్యవస్థలను విస్తరించడం తమ ప్రాథమిక హక్కు అని..తేల్చి చెప్పారు. ఆ విషయంలో ఉత్తరకొరియా ఏ మాత్రం వెనక్కి తగ్గదని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : అమెరికా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుందా?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.