
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాన్ని శాసిస్తున్న అగ్రగామి చిప్ తయారీ సంస్థ ఎన్విడియా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి వెలువడిన సంచలన కథనాలు స్టాక్ మార్కెట్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. బుధవారం సాధారణ ట్రేడింగ్ సెషన్లో ఎంతో ఉత్సాహంగా, లాభాలతో ముగిసిన ఎన్విడియా షేర్లు.. మార్కెట్ ముగిసిన తర్వాత జరిగిన ఆఫ్టర్-అవర్స్ ట్రేడింగ్‌లో కుప్పకూలాయి. ఈ ఒక్క దెబ్బతో ఎన్విడియా మార్కెట్ విలువలో దాదాపు 280 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.23.5 లక్షల కోట్లకు పైగా) క్షణాల్లో ఆవిరి అయిపోయింది.
ఈ భారీ పతనానికి ప్రధాన కారణం జెన్సన్ హువాంగ్‌పై వచ్చిన వివాహేతర సంబంధం ఆరోపణలే. ఎన్విడియా సంస్థలోనే పనిచేస్తున్న ఒక ఉన్నత స్థాయి మహిళా ఎగ్జిక్యూటివ్‌తో హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపణలు రావడంతో ఆయనను సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు బోర్డు సిద్ధమవుతోందని సమాచారం. అయితే ఈ వార్తలతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా భయాందోళనలు మొదలై.. షేర్లను భారీ ఎత్తున విక్రయించడం ప్రారంభించారు.
Also Read : ట్రంప్‌కు ఇరాన్ మాస్టర్ షాక్.. భూగర్భంలో అదృశ్య క్షిపణుల సామ్రాజ్యం.. అసలు ప్లాన్ ఏంటి?
అయితే బుధవారం సాధారణ ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్విడియా షేరు ధర 2.87 శాతం లాభపడి 173.73 డాలర్ల వద్ద స్థిరపడింది. ఆ సమయానికి కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.08 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఆఫ్టర్-అవర్స్ ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. షేరు ధర ఏకంగా 8.27 శాతం పతనమై 159.37 డాలర్ల స్థాయికి పడిపోయింది. 24.14 బిలియన్ల ఔట్‌స్టాండింగ్ షేర్లు, 159.80 డాలర్ల ధర ఆధారంగా లెక్కిస్తే ఎన్విడియా మార్కెట్ విలువ 3.86 ట్రిలియన్ డాలర్లకు దిగజారింది. అంటే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కంపెనీ విలువలో దాదాపు 280 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి.
నిజానికి జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదాలు ముసురుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ఆయన చైనా గూఢచార సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో కలిసి ఆయన చైనా సంస్థలకు అక్రమంగా ఎన్విడియా చిప్‌లను తరలించారనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఈ వ్యవహారంపై అమెరికా చట్టసభ సభ్యులు సైతం తీవ్రంగా స్పందించి.. హువాంగ్ నుంచి వివరణ కోరారు. మరోవైపు ఈ ఆరోపణలపై ఎన్విడియా బోర్డు ఇప్పటికే ఒక స్వతంత్ర విచారణకు ఆదేశించింది. అయితే తమ సంస్థ వల్ల అమెరికా జాతీయ భద్రతకు గానీ, వ్యాపార రహస్యాలకు గానీ ఎలాంటి భంగం వాటిల్లలేదని ఎన్విడియా యాజమాన్యం ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
దాదాపు మూడు దశాబ్దాల క్రితం జెన్సన్ హువాంగ్ ఎంతో కష్టపడి ఎన్విడియాను సహ-స్థాపించారు. ఒక సాధారణ గ్రాఫిక్స్ చిప్ కంపెనీగా మొదలైన సంస్థను.. నేడు ప్రపంచంలోని అత్యంత విలువైన టెక్నాలజీ దిగ్గజాలలో ఒకటిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ఎన్విడియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టింది ఆయనే. అలాంటి దార్శనిక నాయకుడు ఇప్పుడు వరుస ఆరోపణలతో పదవిని కోల్పోయే పరిస్థితి రావడం టెక్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
Also Read : కిమ్ వారసురాలిగా ఆమెనేనా? ఉత్తర కొరియాలో నాలుగో తరం సిద్ధం!









