
Imran Khan : మాజీ క్రికెటర్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఒకప్పటి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు స్పందించారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న కథనాల నేపథ్యంలో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ వారు పాక్ ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ లేఖ రాసిన వారిలో 9 దేశాలకు చెందిన 21 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉండటం గమనార్హం. వారిలో మన దేశం నుంచి ఒకప్పటి కెప్టె్న్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వెంగ్ సర్కార్ తదితరులున్నారు.
ఈ సందర్భంగా వారు లేఖలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఒకప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి రోజుకో రకమైన వార్త బయటకు వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్యం అందించాలని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కు వారంతా లేఖ రాశారు. కాగా, గత ఆరు నెలల కిందట ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై 14 మంది అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. తాజాగా మరోసారి రాసిన లేఖలో వారికి మరో ఏడుగురు తమకు జత అయ్యారని వారు వివరించారు.
Also Read : ఇరాన్‌కు భారీ ఊరట.. దేశంలో గ్యాస్ నిల్వల గుర్తింపు… మరోవైపు ఉద్రిక్తతలు
కాగా, ఇది రాజకీయ కోణంలో చేస్తున్న విజ్ఞప్తి కాదని… కేవలం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు క్రికెటర్లు పేర్కొన్నారు. మానవతా కోణంలో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ఈ లేఖలో మాజీ కెప్టె్న్లు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి వారం ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు అతని కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
కాగా, క్రికెటర్లు అందరూ ఈ సందర్భంగా మూడు అంశాలను ప్రస్తావించారు. ఇమ్రాన్‌ఖాన్ కుడి కంట్లో చూపు కోల్పోయారని వార్తలు వస్తున్నాయని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పూర్తిగా, స్వతంత్రంగా అంచనా వేసే మెడికల్ బోర్డును అనుమతించాలని వారు కోరారు. ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులు ప్రతివారం ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ బోర్డు సూచనల ప్రకారం ఆలస్యం లేకుండా వైద్య పరీక్షలు చేయాలని ఆ లేఖలో ప్రస్థావించారు. తాము పాక్ న్యాయ ప్రక్రియలో తలదూర్చాలని అనుకోవడం లేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనే అమలు చేయాలని కోరుతున్నట్లు లేఖలో స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఇమ్రాన్‌ఖాన్‌ను పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అనంతరం రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. అల్ షిపా ఆస్పత్రికి చెందిన డాక్టర్ల సమక్షంలో ఇమ్రాన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించామని, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
Also Read : పాకిస్తాన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న టర్కీ యుద్ధ విమానాలు.. అసలేం జరుగుతోందంటే?









