
Pakistan : పాకిస్తాన్‌లో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మహిళలపై దాడులు, హత్యలు ఎక్కువైపోతున్నాయి. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున, టాక్సిలా నగరంలో 28 ఏళ్ల ప్రముఖ టిక్‌టాకర్ షంసో బీబీని కొందరు బైక్‌పై వచ్చి దారుణంగా కాల్చి చంపారు. ఆన్‌లైన్‌లో ఈమెను ఆయేషా గిలమానా అని పిలుస్తారు. ఈమెకు టిక్‌టాక్‌లో 13 లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె తన చెల్లి, తమ్ముడితో కలిసి కారులో వెళ్తోంది.
షంసో బీబీ తండ్రి ఫజల్ షాహిబ్‌జాదా పోలీసులకు చెప్పిన దాని ప్రకారం, ఘటనకు ముందు కాషిఫ్ అనే వ్యక్తి ఫోన్ చేసి బీబీని ఇంటి బయటకు రమ్మన్నాడు. దాంతో ఆమె తన 15 ఏళ్ల చెల్లి అసీమా, తమ్ముడు నైమతుల్లాతో కలిసి కారులో బయటకు వెళ్లింది. దారిలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును అడ్డుకుని చాలా దగ్గర నుంచి కాల్పులు జరిపారు. బుల్లెట్ మెడకు తగలడంతో బీబీ అక్కడికక్కడే చనిపోయింది. కాల్పుల వల్ల కారు అదుపు తప్పి వేరే బండిని ఢీకొనడంతో బీబీ చెల్లి అసీమాకు పెద్ద గాయాలయ్యాయి.
డబ్బుల గొడవల వల్లే ఈ హత్య జరిగిందని బీబీ ఇంట్లోవాళ్లు చెబుతున్నారు. కౌసర్, జావేద్ అనే వ్యక్తులకు బీబీ డబ్బులు ఇచ్చిందని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు వారు ఆమెను బెదిరించారని తండ్రి చెప్పాడు. ఆ డబ్బులు ఎగ్గొట్టడానికే వారిద్దరూ కాషిఫ్‌తో కలిసి ఈ హత్య చేయించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై ముందే ఇస్లామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బీబీ తమ్ముడు రహమతుల్లా చెప్పాడు. బీబీ చనిపోయాక ఆమెకున్న టిక్‌టాక్ ఖాతాను ఇంట్లోవాళ్లు డిలీట్ చేశారు.
పాకిస్తాన్‌లో ఆడవాళ్లకు ఉద్యోగాలు చేసే అవకాశాలు చాలా తక్కువ. అందుకే చాలామంది మహిళలు డబ్బులు సంపాదించుకోవడానికి, పేరు తెచ్చుకోవడానికి టిక్‌టాక్ వాడుతున్నారు. కానీ, ఇలా పాపులర్ అవుతున్న మహిళలపై వేధింపులు, దాడులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో సనా జావేద్ అనే టిక్‌టాకర్‌ను ఆమె భర్తే కాల్చి చంపగా, మే నెలలో సనా యూసుఫ్ అనే 17 ఏళ్ల అమ్మాయిని చంపిన వ్యక్తికి కోర్టు ఉరిశిక్ష వేసింది.
గత ఏడాది మెహక్ షెహజాది, సుమీరా రాజ్‌పుత్ అనే టిక్‌టాకర్లు కూడా దారుణంగా చనిపోయారు. లాహోర్ పార్కులో అయేషా అక్రమ్ అనే అమ్మాయిపై పెద్ద గుంపు దాడి చేయడం కూడా అప్పట్లో పెద్ద సంచలనం అయింది. ఇలా సోషల్ మీడియాలో ఉండే ఆడవాళ్లపై వరసగా దాడులు జరగడం అక్కడ పెద్ద ఆందోళనగా మారింది.









