Earthquake: ఈ రోజు ఉదయం సంభవించిన భూకంపంతో లాటిన్ అమెరికా దేశాలు ఒక్కసారిగా వణికిపోయాయి. భూమి పొరల్లో చోటుచేసుకున్న తీవ్ర కదలికలతో కొలంబియా దేశం ఒకసారిగా భయంతో వణికిపోయింది. కొలంబియా రాజధాని నగరంలో భారీ భవనాలు సైతం ఒకసారిగా ఊగిపోవడంతో జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగు తీశారు. ఈ భారీ భూకంపం ప్రకంపనలు కేవలం కొలంబియాకే పరిమితం కాలేదు. పొరుగునే ఉన్న ఈక్వెడార్, పనామా వరకు వ్యాపించడంతో ఆయా దేశాలు కూడా భయం గుప్పిట్లో చిక్కుకున్నాయి.  కొలంబియా రాజధాని బొగోటాలో సోమవారం ఉదయం భూమి కంపించింది. దీంతో  ఇళ్లు, కార్యాలయాల భవనాలు అటూఇటూ ఊగిపోయాయి. కదలికలతో  ఏ భవనం ఎప్పుడు కుప్పకూలుతుందోనని భయాందోళనకు గురైన జనం అప్రమత్తమై వెంటనే తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడం కనిపించింది. జసమంతా నివాసాలు వదిలి రోడ్లమీదకు రావడంతో  రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.

Also Read : రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడి.. 12 మంది మృతి.. 39 మందికి గాయాలు

ఈ భూకంప తీవ్రతపై వివిధ భూగర్భ శాస్త్ర పరిశోధనా సంస్థలు వేర్వేరు లెక్కలను ప్రకటించాయి. అమెరికా జియోలాజికల్ సర్వే ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదు చేసింది. కొలంబియా స్థానిక జియోలాజికల్ ఏజెన్సీ మాత్రం ఇది 6.6 తీవ్రత కలిగి ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఇక జర్మనీకి చెందిన GFZ సంస్థ భూకంప తీవ్రతను 6.8గా వెల్లడించింది. పశ్చిమ కొలంబియాలోని ‘శాన్ జోస్ డెల్ పాల్మర్’ ప్రాంతానికి సమీపంలో భూమికి దాదాపు 79 నుంచి 100 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు నిపుణులు పేర్కొన్నారు.  ఈ విపత్తు ప్రభావం ఒక్క కొలంబియాలోనే కాకుండా పొరుగు దేశాల్లోనూ స్పష్టంగా కనిపించినట్లు ఆయా దేశాలు వెల్లడించాయి. పక్కనే ఉన్న ఈక్వెడార్ రాజధాని క్విటో నగరంతో పాటు.. సుదూరంగా ఉన్న పనామా దేశంలోనూ ప్రజలు ఈ ప్రకంపనలతో వణకిపోయిన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అటు వెనిజులా సరిహద్దు ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు స్థానికులు వెల్లడించారు. దీన్ని బట్టి ఈ భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాగా, ఊహించని విధంగా భూకంపం చోటు చేసుకోవడంతో కొలంబియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విభాగాలు వెంటనే రంగంలోకి దిగింది. భూంకంపం దాటికి ఎక్కడైనా భవనాలు కూలిపోయాయా? ఎవరికైనా గాయాలయ్యాయా? అనే వివరాలను క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు  ఆరాతీస్తున్నారు. అయితే అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎటువంటి సునామీ హెచ్చరికలు రాలేదు. అయితే భారీ ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరిగినట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అధికారులు పరిస్థితులను నిశితంగా పరిశీలస్తున్నారు. మరింత సమాచారం అందిన తర్వాత భూకంప తీవ్రతపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Also Read : రష్యా టూ ఇండియా ట్రైన్.. హిందూ మహాసముద్రానికి నేరుగా రైల్వే లైన్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.