
గత కొద్ది నెలలుగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. ఇప్పుడు అక్కడ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాజాగా ఆ జలసంధి సమీపంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సౌదీ ప్రభుత్వ మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Saudi Aramco Helicopter Crash
14 people were killed on Sunday after a helicopter belonging to Saudi Arabia’s Aramco crashed in Ras Tanura, the Saudi state news agency reported, adding that the cause was unknown and an investigation is ongoing.pic.twitter.com/8BuEqkKQlo
— Priyathosh Agnihamsa (@priyathosh6447) June 28, 2026
పర్షియన్ గల్ఫ్ పశ్చిమ తీరాన ఉన్న కీలక ప్రపంచ చమురు కేంద్రం ‘రాస్ తనూరా’లో సౌదీ అరామ్‌కోకు చెందిన హెలికాఫ్టర్ సాంకేతిక సమస్య కారణంగా అదుపుతప్పి నేలకూలింది. ప్రమాదం సమయంలో ఆ హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది సిబ్బంది ఉండగా.. వారంతా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై ఇంధన మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారందరూ సౌదీ జాతీయులే అని పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.
కాగా ఈ ‘రాస్ తనూరా’ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి టెర్మినల్. ఇటీవల అమెరికా – ఇరాన్ మధ్య భీకరమైన యుద్ధం నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల పాటు ఈ రాస్ తనూరా కేంద్రం కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ మధ్యనే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో.. రెండు రోజుల క్రితం అంటే శుక్రవారం దీనిని పునఃప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ ఘోర ప్రమాదం జరగడం గమనార్హం.









