పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్‌లో ఊహించని ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాధి, మెరుగైన భవిష్యత్తు కోసం అక్రమ మార్గాల ద్వారా యూరప్ ఖండానికి వెళ్లేందుకు ప్రయత్నించిన వలసదారుల ప్రయాణం సముద్రంలో విషాదాంతమైంది. సెనెగల్ తీరప్రాంతం నుంచి వలసదారులతో బయలుదేరిన ఒక పడవ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. ఒకవైపు సముద్రంలో బీభత్సమైన అలలు, మరోవైపు పరిమితికి మించిన ప్రయాణికులు ఉండటంతో ఈ ఘోర ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కనీసం 21 మంది వలసదారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో పడవలో ప్రయాణిస్తున్న వారిలో కేవలం ఒక్కరు మాత్రమే సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద వార్త గురించి సమాచారం తెలిసినవెంటనే స్థానిక ప్రభుత్వం, సహాయక బృందాలు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టాయి.

అయితే పడవలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే అట్లాంటిక్ వలస మార్గం పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల నుంచి యూరప్‌కు చేరుకోవడానికి వలసదారులు నిరంతరం అట్లాంటిక్ మహాసముద్ర మార్గం నుంచే వెళ్తుంటారు. అయితే ఈ మార్గం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలలో ఒకటిగా నిలిచింది.