
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తే వెంటనే అరెస్ట్ అవుతారని ఆ దేశ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్ స్పష్టం చేశారు. ఆమె ఇండియా నుంచి దేశంలో అడుగుపెట్టిన క్షణమే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ, తన ప్రజలు పిలుస్తున్నందున రాబోయే డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని హసీనా అంతకుముందు ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు. తాను హత్య చేయబడవచ్చు లేదా జైలు పాలు కావచ్చు అని తనకు ముందే తెలుసని ఆమె వెల్లడించారు.
అయితే, 2025 నవంబర్‌లో మరణశిక్ష పడిన షేక్ హసీనా దేశానికి వస్తే నేరుగా కోర్టులో లొంగిపోయే అవకాశం కూడా లభించకపోవచ్చని లా మినిస్టర్ అసదుజ్జమాన్ తేల్చిచెప్పారు. దేశ పౌరురాలిగా ఆమెకు స్వదేశానికి తిరిగి వచ్చే హక్కు ఉన్నప్పటికీ, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టాన్ని ఉల్లంఘించకుండా తాము అధికారాలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనల కారణంగా అధికారం కోల్పోయిన షేక్ హసీనా అప్పటి నుంచి భారత్‌లో అజ్ఞాతంలో తలదాచుకుంటున్నారు. ఆ తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దు చేయగా, బంగ్లాదేశ్ అంతర్జాతీయ ట్రైబ్యునల్ ఆమెకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఈ తీర్పు రాజకీయ కక్షసాధింపు చర్య అని హసీనా కొట్టిపారేయగా, అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ సంస్థలు ఈ విచారణ తీరును ప్రశ్నించాయి. కాగా, ఈ ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చి తారిక్ రెహ్మాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా, హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుతోంది. దాన్ని భారత్ పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.









