అంతరిక్షంలో అప్పుడప్పుడు ఊహించని వింతలు జరుగుతుంటాయి. కానీ ఈసారి ఏకంగా చందమామపైనే ఒక భారీ విధ్వంసం జరగబోతున్నట్లు తెలుస్తోంది. రాక్షసబల్లులను అంతమొందించిన గ్రహశకలం తరహాలోనే.. ఆగస్టు 5న ఒక భారీ రాకెట్ శకలం గంటకు 8,700 కిలోమీటర్ల తుఫాను వేగంతో చంద్రుడి వైపు దూసుకెళ్తోంది. ప్రశాంతంగా ఉండే జాబిల్లి ఉపరితలాన్ని ఇది ఢీకొట్టబోతుంది. అయితే అక్కడ మనుషులు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది.

Also Read : ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా-ఇజ్రాయెల్ మధ్య లొల్లి.. నెతన్యాహుకి ట్రంప్ స్ట్రాంగ్ కౌంటర్

ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్ గతంలో చంద్రుడిపైకి రెండు ల్యాండర్లను పంపేందుకు ఒక రాకెట్‌ను ప్రయోగించింది. ఆ ప్రాజెక్టు విజయవంతమైనప్పటికీ.. వాడేసిన రాకెట్ భాగం ఒకటి అస్థిర కక్ష్యలో అంతరిక్షంలోనే మిగిలిపోయింది. భూమికి తిరిగి రావడానికి లేదా సుదూర అంతరిక్షంలోకి వెళ్లిపోవడానికి దానిలో సరిపడా ఇంధనం లేదు. దీంతో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికి లోనై అది నెమ్మదిగా జాబిల్లి వైపు వెళ్తోంది. ఆగస్టు 5న ఇది తీవ్ర వేగంతో చంద్రుడిపై పడిపోనుంది. ఈ ధాటికి అక్కడ దాదాపు 60 నుంచి 70 అడుగుల భారీ గుంత పడటంతో పాటు చంద్రుడి మట్టి కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగసిపడనుంది.

Also Read : హర్మూజ్‌లో సముద్రపు ల్యాండ్‌మైన్ పేలి చమురు ట్యాంకర్ దగ్ధం

ఈ ఘటన వల్ల భూమికి గానీ, అంతరిక్షంలో తిరుగుతున్న మన వ్యోమగాములు, ఉపగ్రహాలకు ఎలాంటి ప్రమాదం లేదు. పైగా ఒక భారీ వ్యర్థం చంద్రుడిని ఢీకొట్టినప్పుడు ఉపరితలంపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో పరిశోధించడానికి శాస్త్రవేత్తలకు ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది. అయితే భూమిపై ఉన్నట్లు చందమామపై వాతావరణం లేదా గాలి ఉండవు. అందుకే 1969లో అమెరికా వ్యోమగాములు నీల్ ఆమ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్‌లు అక్కడ వేసిన అడుగుల జాడలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కానీ స్పేస్‌ఎక్స్ రాకెట్ తరహాలోనే వ్యర్థాలు వచ్చి పడుతూ ఉంటే.. ఇలాంటి చారిత్రక వారసత్వ చిహ్నాలతో పాటు ఇప్పటికే శాస్త్రవేత్తలు అక్కడ ఏర్పాటు చేసిన విలువైన పరికరాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1967లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం అంతరిక్షం మనుషులందరి ఉమ్మడి ఆస్తి. ఏ దేశం కూడా దానిపై సర్వాధికారాలు చెలాయించలేవు. అయితే చంద్రుడిని ఎలా ఉపయోగించుకోవాలి. ఉపగ్రహ వ్యర్థాలను ఎలా నియంత్రించాలి అనే దానిపై స్పష్టమైన చట్టాలు లేవు. ప్రస్తుత నిబంధనల ప్రకారం స్పేస్‌ఎక్స్ రాకెట్ వల్ల జరిగే నష్టానికి ఆ కంపెనీ, అమెరికా దేశమే బాధ్యత వహించాలి. అందుకే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా ఉండేందుకు చంద్రుడిపైకి జరిపే ప్రయోగాలపై ఒక అంతర్జాతీయ రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో కఠినమైన పర్యవేక్షణ, నోటీసులు జారీ చేసే వ్యవస్థ ఉండాలని నిపుణులు కోరుతున్నారు.