
Donald Trump : దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇరాక్‌లో తిష్టవేసిన అగ్రరాజ్యం అమెరికా తమ సైనిక మిషన్ అధికారికంగా ముగిసిందని సంచలన ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో భయంకర ఉగ్రవాద సంస్థ ‘ఐసిస్’ ఆట కట్టించడమే లక్ష్యంగా సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ పోరాటానికి తెరపడింది. ఉత్తర ఇరాక్‌లోని అత్యంత కీలకమైన ఇర్బిల్ వైమానిక స్థావరం నుంచి అమెరికా సైనికుల చివరి బృందం బుధవారం తమ స్వదేశానికి ప్రయాణమైంది. దీంతో ఇరాక్ నేలపై అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ సంపూర్ణంగా ముగిసిందని పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ స్పష్టం చేశారు.
ఇరాక్‌లో అమెరికా ప్రయాణం ఈనాటిది కాదు. దీని వెనుక రెండు దశాబ్దాల చరిత్ర ఉంది. 2003వ సంవత్సరంలో అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ వద్ద విధ్వంసకర రసాయనిక ఆయుధాలు ఉన్నాయనే నెపంతో అమెరికా ఆ దేశంపై విరుచుకుపడింది. నాటి సైనిక చర్యలో సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూల్చివేసి ఆయనను ఉరితీశారు. ఆ తర్వాత 2011 వరకు అక్కడే బస చేసిన యూఎస్ బలగాలు క్రమంగా తమ బలగాలను వెనక్కి తీసుకున్నాయి.
Also Read : బలూచిస్థాన్‌లో కలకలం.. పాక్ సైనికులపై మహిళా యూనిట్ దాడి!
అయితే 2014 నాటికి ఇరాక్ తీవ్రమైన ఉగ్రవాద సంక్షోభంలో కూరుకుపోయింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఇరాక్‌లోని మూడో వంతు భూభాగాన్ని అనేక పట్టణాలను తమ ఆధీనంలోకి తీసుకుని నరమేధం సృష్టించింది. ఆ సమయంలో పరిస్థితి చేజారిపోవడంతో ఐసిస్ రాక్షసత్వాన్ని అడ్డుకోవడానికి ఇరాక్ ప్రభుత్వమే స్వయంగా అమెరికా సహాయాన్ని కోరింది. అలా మళ్లీ ఇరాక్‌లో అడుగుపెట్టిన అమెరికా సైన్యం, స్థానిక బలగాలతో కలిసి ఐసిస్ అడ్డాలను బాంబులతో గుల్ల చేసింది. దాదాపు ఒక దశాబ్దం పాటు జరిగిన హోరాహోరీ పోరాటం తర్వాత ఐసిస్ వెనక్కి తగ్గింది. దీంతో 2024లో రెండు దేశాలూ చర్చించుకుని.. తమ సైనిక మిషన్‌ను శాశ్వతంగా ముగించాలని నిర్ణయించుకున్నారు.
అమెరికా బలగాలు పూర్తిగా నిష్క్రమించడాన్ని ఇరాక్ కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఇది తమ దేశ సార్వభౌమత్వానికి, స్వయం ప్రతిపత్తికి దక్కిన నిదర్శనమని పేర్కొంది. ఇకపై తమ దేశ భద్రతను చూసుకునే శక్తి, సామర్థ్యం తమ సొంత మిలిటరీ బలగాలకు ఉందని ఇరాక్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. అయితే అమెరికాతో సైనిక మిషన్ ముగిసినప్పటికీ.. సాధారణ ద్వైపాక్షిక భద్రతా ఒప్పందాలు, దౌత్య సంబంధాలు కొనసాగుతాయని పెంటగాన్ ప్రకటించింది.
ఒకవైపు అమెరికా సైన్యం వెళ్లిపోతుంటే, ఇరాక్‌లోని విభిన్న వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేక, భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాక్‌లోని స్వయంప్రతిపత్తి కలిగిన ‘కుర్దిస్థాన్’ ప్రాంత పాలకులు అమెరికా నిష్క్రమణపై తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇరాన్ మద్దతు ఉన్న ముఠాల నుంచి డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో తమ భూభాగంపై వెయ్యికి పైగా దాడులు జరిగాయని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు అమెరికా వైమానిక దళాలు కనుక పూర్తిగా వెళ్లిపోతే శత్రువుల నుండి తమకు రక్షణ కరువై తీవ్ర ముప్పు వాటిల్లుతుందని వారు భయపడుతున్నారు. ఇంకోవైపు ఇరాన్ మద్దతుతో నడిచే షియా మిలీషియా వర్గాలు మాత్రం అమెరికా సైన్యం వెళ్లిపోవడాన్ని హర్షిస్తున్నాయి. ఇరాక్ నేలపై విదేశీ సైన్యం ఉనికి అంతమవడం తమ విజయం అని భావిస్తూ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇరాక్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అక్కడ శాంతి భద్రతలు నిలుస్తాయా లేదా మళ్లీ ఉగ్రవాదం తలెత్తుతుందా అనేది చూడాలి.
Also Read : మా జోలికి వస్తే ఊరుకోం.. ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్









