Federal judge voids Trump's H-1B visa requirements
Federal judge voids Trump's H-1B visa requirements

Donald Trump : వలసలను తగ్గించే ఉద్ధేశంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. గతేడాది హెచ్‌1బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజును విధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నిర్ణయం తీసుకుని ఏడాది గడచిన సందర్బంగా ఆ నిర్ణయాన్ని మరో ఏడాది పొడిగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఈ వీసా దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశిస్తూ ట్రంప్‌ రెండు ఉత్తర్వులను జారీ చేయడం గమనార్హం. కాగా, హెచ్‌1బీపై గత ఏడాది జారీ చేసిన పీజూ పెంపు ఉత్తర్వువల్ల పెద్ద ఐటీ అవుట్‌సోర్సింగ్‌ కంపెనీల నుంచి 92శాతం హెచ్‌1బీ దరఖాస్తులు తగ్గిపోయినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

‘‘హెచ్‌1బీ వీసాలపై గత2025 నాటి ఉత్తర్వులను పొడిగిస్తున్నాం. దీనివల్ల అమెరికా జాతీయ భద్రతతోపాటు ఆర్థిక ప్రయోజనాలను కాపాడగలుగుతున్నాం. అమెరికన్లకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. దీంతోపాటు అత్యంత నిపుణులైన వారినే కంపెనీలు నియమించుకుంటాయి’’ అని ట్రంప్‌ పేర్కొనడం గమనార్హం.

మనకే ఎక్కువ నష్టం
కాగా, హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తు చేస్తున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. ప్రస్తుత నిర్ణయం వల్ల మనకే ఎక్కువ నష్టం. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వు ఈ నెలలో ముగియనుండటంతో ట్రంప్‌ తాజా ఉత్తర్వులను జారీ చేశారు. అయితే విద్యార్థి వీసాలపై అమెరికాలో ఉంటున్న వారికి ఈ నిబంధన వర్తించదు. విదేశాల నుంచి దరఖాస్తు చేసుకునే వారే లక్ష డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే గత ఏడాది ట్రంప్‌ విధించిన లక్ష డాలర్ల ఫీజుపై విషయమై రెండు ఫెడరల్‌ కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి.

లక్ష డాలర్ల ఫీజూ వివాదం ఇలా కొనసాగుతుండగానే ట్రంప్ మరో బాంబు పేల్చాడు. హెచ్‌1బీ దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించాలని తాజాగా ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో సంస్థల మధ్య అంతర్గత సహకారం మరింత ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఈ ఉత్తర్వు హెచ్‌1బీ వీసా సమగ్రతను మరింత మెరుగుపరుస్తుంది. పరిశీలన సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. అమెరికన్లను తొలగించే అవకాశమున్న చోట దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించడానికి అవకాశమిస్తుంది’’ అని శ్వేతసౌధం విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌ పేర్కొంది.

ప్రస్తుతం నిర్ణయం వల్ల అమెరికన్లకు నష్ట జరగకూడదన్నది ట్రంప్ ఉద్దేశంగా కనపడుతుంది. హెచ్‌1బీ దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ఇటీవల అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజా నిర్ణయం తో అలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అమెరికా విదేశాంగ, కార్మిక, హోంలాండ్‌ భద్రతశాఖలను ఈ ఉత్తర్వు నిర్దేశించినట్లయింది.

కాగా, హెచ్‌1బీ వీసా దరఖాస్తుల పరిశీలనను కఠినతరం చేయలన్నా ట్రంప్ నిర్ణయాన్ని ద ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్‌ (ఎఫ్‌ఐఐడీఎస్‌) స్వాగతించింది. అయితే దానివల్ల అమెరికా ఆవిష్కరణలకు విఘాతం కలగకూడదని కూడా అభిప్రాయపడింది. అత్యంత నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు వెంటనే అమెరికన్లు దొరక్కపోవచ్చని అభిప్రాయపడింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.