Donald Trump
Donald Trump

Trump Warning : హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ విషయంలో ఒమన్ జోక్యం చేసుకుని వాషింగ్టన్ అనుసరిస్తున్న మార్గాలకు ఆటంకం కలిగిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అవసరమైతే సైనిక చర్యకు వెనకాడమని ట్రంప్ స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత వాణిజ్య నౌకాయానం కోసం ఇరాన్, ఒమన్‌ల మధ్య సంప్రదింపులు జరుగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి.

Also Read : ట్రంప్‌కు బిగ్ షాక్.. ప్రజల్లో భారీగా పడిపోయిన క్రేజ్.. ఇక పదవి పోయినట్లేనా?

ఇరాన్ వెంటనే లొంగిపోవాలని, తమ పట్ల తెల్ల జెండా ఎగురవేయాలని ట్రంప్ ఇటీవల డిమాండ్ చేశారు. సైనిక చర్యలపై తనకు ఎటువంటి తొందర లేదని, ఒత్తిడిని కొనసాగించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు పశ్చిమ ఆసియాలో అమెరికా ఉపయోగించిన సైనిక వనరులు చాలా తక్కువ అని, ఇంకా తమ వద్ద భారీగా ఆయుధ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధ వ్యవస్థలను బదిలీ చేయడం ద్వారా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పశ్చిమ ఆసియాలో అవసరమైన వాయు రక్షణ వ్యవస్థల కొరతకు కారణమయ్యారని విమర్శించారు.

మరోవైపు హోర్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్‌తో కలిపే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచ ఇంధన రవాణాలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ అస్థిరత ఏర్పడితే గ్లోబల్ మార్కెట్లు, ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో రెండు తీరప్రాంత దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ, వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పించడమే లక్ష్యంగా ఇరాన్-ఒమన్ చర్చలు జరుపుతున్నాయి.

ఈ చర్చలు నెమ్మదించడానికి ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ పలు కారణాలను వెల్లడించారు. నూతన నావిగేషన్ చట్రాన్ని రూపొందించడంలో ఉన్న సంక్లిష్టత, పలువురి ప్రమేయం, అస్థిరతను పెంచేందుకు కొన్ని శక్తులు చేస్తున్న ప్రయత్నాల వల్లే ఆలస్యం అవుతోందని తెలిపారు. హోర్ముజ్ జలసంధిలో అభద్రతా వాతావరణానికి అమెరికా తీసుకుంటున్న చట్టవిరుద్ధ సైనిక చర్యలే ప్రధాన కారణమని ఇరాన్ ఆరోపించింది. రెండు దేశాల మధ్య జూన్ ఒప్పందం గడువు ముగియనుండటంతో అమెరికా-ఇరాన్ సంబంధాలు మరింత క్షీణించే అవకాశం కనిపిస్తోంది.

Also Read : రైలులో సీటు గొడవ: బట్టలు విప్పి.. బ్లేడ్‌తో మోడల్ బీభత్సం!