Trump Says ‘The Moon is Ours’
Trump Says ‘The Moon is Ours’

“The Moon Is Ours”.. చంద్రుడు మాదే అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఈ ఒక్క స్టేట్మెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిబెట్‌కు దారితీసింది. అసలు చంద్రుడు ఎవరిది? అమెరికా నిజంగానే చంద్రుడిపై తమ హక్కు ప్రకటించిందా? ఒక దేశం చంద్రుడిని సొంతం చేసుకోగలదా? లేక అక్కడి నీళ్లు, మినరల్స్ ఎవరు కావాలంటే వాళ్లు తీసుకెళ్లొచ్చా? కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే చంద్రుడిపై జెండా పాతినంత మాత్రాన అది ఆ దేశం సొంతం కాదు. కానీ చంద్రుడి లోపల ఉన్న వనరుల విషయంలో మాత్రం అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. మరి ట్రంప్ ‘The Moon Is Ours’ అని ఎందుకు అన్నారు? అమెరికా చంద్రుడిపై ఏం చేయాలని చూస్తోంది? భవిష్యత్తులో చంద్రుడిపై మైనింగ్ మొదలైతే ఆ వనరులు ఎవరివి అవుతాయి? అసలు చంద్రుడి కోసం మరో కొత్త స్పేస్ రేస్ మొదలైందా? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సెప్టెంబర్ 6న ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో చంద్రుడి ఉపరితలం, అమెరికా జెండా ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేశారు. దానిపై పెద్ద అక్షరాలతో “THE MOON IS OURS” అని ఉంది. అదే టైమ్‌లో స్పేస్ ఫోర్స్, అంతరిక్ష సంబంధిత దృశ్యాలతో మరికొన్ని పోస్టులు కూడా చేశారు. ఆ పోస్టు చూసిన వెంటనే అందరికీ ఓ క్వచ్చన్ వచ్చింది.. “అమెరికా చంద్రుడిని తన ప్రాంతంగా అనౌన్స్ చేసిందా అని”. కానీ వాస్తవానికి అంతర్జాతీయ చట్టం ప్రకారం చంద్రుడిని ఒక దేశం తన ప్రాంతంగా ప్రకటించుకోవడంపై నిషేధం ఉంది. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి.

1967లో వచ్చిన బాహ్య అంతరిక్ష ఒప్పందం నుంచి అంతరిక్ష అన్వేషణ మొదలైన సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య అంతరిక్ష పోటీ (Space competition) ఉండేది. అలాంటి టైమ్‌లోనే ప్రపంచ దేశాలు ఒక బేసిక్ రూల్‌పై ఒప్పందానికి వచ్చాయి. ఈ రూల్స్ ప్రకారం స్పేస్ ఎవరి ప్రైవేట్ ప్రోపర్టీ కాదు.. ఏ దేశం కూడా చంద్రుడిని కానీ, ఇతర ఖగోళ వస్తువులను కానీ తన ప్రాంతంగా క్లయిమ్ చేయకూడదు అని ఈ ఒప్పందం చెబుతోంది. ముఖ్యంగా ఆర్టికల్ 2లో బాహ్య అంతరిక్షం, చంద్రుడు, ఇతర ఖగోళ వస్తువులను ఏ దేశం కూడా తన సొంతం అని అనౌన్స్ చేయకూడదు అని ఉంది.

అంటే.. ఒక దేశం చంద్రుడిపై లాండర్ పంపింది అనుకోండి. అక్కడ అమెరికా జెండా పెట్టింది. ఒక బిల్డింగ్ కట్టింది. ఒక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసింది. దాని చుట్టూ ఒక సరిహద్దు కూడా పెట్టుకుంది. అయినా “ఈ ల్యాండ్ అంతా మాదే” అని చెప్పడానికి ఆ కంట్రీకి చట్టపరమైన హక్కు ఉండదు. ఎందుకంటే చంద్రుడిపై ఒక ప్రాంతాన్ని యూజ్ చేయడం.. అలాగే ఆ ప్రాంతానికి ఓనర్ అవడం రెండు వేర్వేరు విషయాలు.

Also Read : శత్రువుల గోడను బద్దలు కొట్టిన పుతిన్.. పార్లమెంట్‌లో 355 సీట్లు.. కోలుకోని ట్రంప్!

అయితే ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ క్వచన్ ఉంది. చంద్రుడు మనది కాకపోతే.. చంద్రుడిపై దొరికే వనరులు ఎవరివి?.. చంద్రుడి ఉపరితలంలో నీటి మంచు, ఖనిజాలు, లోహాలు లాంటి వనరులు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రుడి ధ్రువాల దగ్గర శాశ్వత నీడ ప్రాంతాలలో నీటి మంచు ఉన్నట్లు శాస్త్రీయ పరిశీలనలు సూచిస్తున్నాయి. ఈ వాటర్‌ను భవిష్యత్తులో డ్రింకింగ్ వాటర్ కోసం మాత్రమే కాదు.. ఆక్సిజన్, హైడ్రోజన్‌గా విడగొట్టి రాకెట్ ఇంధనం తయారు చేయడానికి కూడా యూజ్ చేసే దానిపై NASA పరిశోధనలు చేస్తోంది. అంటే భవిష్యత్తులోలో చంద్రునిపై నీళ్లు అంటే.. కేవలం తాగడానికి యూజ్ చేసే వాటర్ కాదు.. అంతరిక్షంలో ఇంధన కేంద్రం లాంటిది అయ్యే ఛాన్స్ ఉంది.

ఉదాహరణకు ఒక ప్రైవేట్ కంపెనీ చంద్రుడిపైకి వెళ్లి.. అక్కడ ఉన్న చంద్రుని మట్టిని తవ్వి.. అందులోని మినరల్స్‌ను బయటకు తీసింది అనుకోండి. లేదా చంద్రునిపై ఉన్న మంచును సేకరించి దాన్ని ప్రాసెస్ చేసింది అనుకోండి. ఆ కంపెనీ తీసుకున్న వనరులు దాని ప్రాపర్టీ అవుతుందా అంటే.. ఇక్కడే అంతర్జాతీయ చట్టంలో దీనిపై పెద్ద చర్చ ఉంది.

బాహ్య అంతరిక్ష ఒప్పందం ప్రకారం.. చంద్రుడిని ఒక దేశం సొంతం చేసుకోవడడం పూర్తిగా నిషేధం. కానీ ఒక వనరును చంద్రుని ఉపరితలం నుంచి తీసిన తర్వాత దాని ఓనర్‌షిప్ ఎలా ఉండాలి? వాణిజ్యపరమైన మైనింగ్ కు ఖచ్చితమైన నియమాలు ఏంటి? ఒక కంపెనీ ఎంత వరకు మైనింగ్ చేయవచ్చు? ఒక ప్రాంతంలో ఒక కంపెనీ ఆపరేషన్ మొదలుపెడితే మరో దేశం అక్కడికి వెళ్లి మైనింగ్ చేయవచ్చా? ఇలాంటి ప్రాక్టికల్ క్వచ్చన్స్‌‌కు బాహ్య అంతరిక్ష ఒప్పందంలో డీటెయిల్డ్ కమర్షియల్ మైనింగ్ కోడ్ లేదు. అందుకే ఈ ఇష్యూ ఇప్పటికీ న్యాయపరమైన చర్చలోనే ఉంది.

అమెరికా మాత్రం ఈ విషయంలో తన స్థానాన్ని ముందే క్లియర్ చేయడానికి ట్రై చేసింది. 2015లో కమర్షియల్ స్పేస్ లాంచ్ కాంపిటిటివ్‌నెస్ యాక్ట్ (Commercial Space Launch Competitiveness Act) ద్వారా.. అమెరికన్ పౌరులకు అంతరిక్ష వనరులను యూజ్ చేయడానికి, ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి, అమ్మడానికి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ వచ్చింది. అయితే అదే టైమ్‌లో ఇది అమెరికా ఏ ఖగోళ వస్తువుపైనా సార్వభౌమాధికారం లేదా ఓపర్షిప్ క్లెయిమ్ చేస్తుందని అర్థం కాదు. సింపిల్‌గా చెప్పాలంటే.. “చంద్రుడిని మేం సొంతం చేసుకోం.. కానీ అక్కడి నుంచి చట్టపరంగా తీసుకొచ్చిన వనరులను మాత్రం యూజ్ చేసుకోవచ్చు అన్న నమూనాను అమెరికా తీసుకుంది.

ఇదే కాన్సెప్ట్‌ను NASA తన ఫ్యూచర్ మూన్ ప్లాన్స్‌లో కూడా యూజ్ చేస్తోంది. NASAకి చంద్ర అన్వేషణ అంటే కేవలం అక్కడికి వెళ్లి ఫోటోస్ తీసుకుని తిరిగి రావడం కాదు. ఫ్యూచర్ మిషన్స్ ఎక్కువకాలం చంద్రునిపై ఉండాలంటే అక్కడ దొరికే వనరులను అక్కడే యూజ్ చేయాలని చూస్తోంది. అందుకే NASA తమ పరిశోధనలో.. చంద్రుడిపై నీటి మంచు, మట్టిలో దొరికే వనరులతో ఇంధనం తయారు చేయడం, విద్యుత్ ఉత్పత్తి చేయడం, మనుషులు అక్కడ ఉండేలా స్థావరాలు ఏర్పాటు చేయడం లాంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

ఇక మరో ముఖ్యమైన విషయం ఆర్టెమిస్ ఒప్పందాలు. NASA, US స్టేట్ డిపార్ట్‌మెంట్ కలిసి 2020లో ఈ ఫ్రేమ్‌వర్క్‌ను స్టార్ట్ చేశారు. చంద్రుడు, అంగారకుడు, గ్రహశకలాలు వంటి ప్రదేశాలలో శాంతియుత, పారదర్శక, సహకార అన్వేషణకు కొన్ని సాధారణ సూత్రాలు పెట్టారు. ముఖ్యంగా వనరుల వెలికితీత గురించి కూడా ఒక ముఖ్యమైన అంశం ఉంది. అంతరిక్ష వనరులను తీసి యూజ్ చేయడం అంతర్జాతీయ చట్టంను ఫాలో అవ్వడమే అని ఆర్టెమిస్ ఫ్రేమ్‌వర్క్ చెబుతుంది. కానీ ఇందులో ఒక దేశం చంద్రుడి భూభాగాన్ని సొంతం చేసుకోవచ్చని మాత్రం చెప్పలేదు.

ఇక్కడ “Safety Zones” అనే కాన్సెప్ట్ కూడా చాలా ముఖ్యం. ఒక కంపెనీ లేదా దేశం చంద్రునిపై ఒక మైనింగ్ ఆపరేషన్ చేస్తుంటే.. మరో అంతరిక్ష నౌక వచ్చి అదే ఆపరేషన్‌కు అడ్డుతగలడం చేయకుండా ఒక పరిమిత భద్రతా ప్రాంతం ఉండొచ్చు. దీని ఉద్దేశం యాజమాన్యం సృష్టించడం కాదు.. ఢీకొనడం, జోక్యం, ప్రమాదాలును దూరం చేయడం. కానీ ఫ్యూచర్‌లో ఇదే సేఫ్టీ జోన్ ఎంత పెద్దదిగా ఉండాలి? ఒక కంపెనీ ఒక పెద్ద ప్రాంతం చుట్టూ సేఫ్టీ జోన్ పెట్టుకుంటే అది ఆచరణాత్మకంగా ఏకైక నియంత్రణలా మారుతుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఆర్టెమిస్ ఒప్పందాలలో ఇప్పటివరకు 73 దేశాలు దేశాలు చేరాయి. ఇందులో మన ఇండియా కూడా ఉంది. అయితే చంద్రుని ఒప్పందం అనే మరో అంతర్జాతీయ ఒప్పందం కూడా ఉంది. ఇది 1979లో వచ్చింది. ఈ ఒప్పందం చంద్రుడిని, దాని సహజ వనరులను “common heritage of mankind” గా చూస్తుంది. అంటే చంద్రుని ఉపరితలం, ఉపరితలం క్రింద లేదా అక్కడ సహజంగా ఉన్న వనరులు ఏ దేశానికి లేదా ఒక కంపెనీకి ప్రాపర్టీగా మారకూడదని ఈ అగ్రీమెంట్ చెబుతుంది. ఒకవేళ వాణిజ్యపరమైన దోపిడీ పెద్ద స్థాయిలో సాధ్యమయ్యే సమయంలో ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పాటు చేసి.. వనరుల నుంచి వచ్చే బెనిఫిట్స్‌ను దేశాల మధ్య ఈక్వల్‌గా షేర్ చేయాలనే ఐడియా కూడా ఇందులో ఉంది.

Also Read : ఇక ఇరాన్‌ విమానాలు ఎగరవు… గ్లోబల్‌ షట్‌డౌన్‌ ప్రకటించిన అమెరికా

కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. చంద్రుని అగ్రిమెంట్‌కు బాహ్య అంతరిక్ష ఒప్పందంతో పోలిస్తే పాల్గొనడం చాలా తక్కువ. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా వంటి ప్రధాన అంతరిక్ష శక్తులు..ఈ చంద్రుని అగ్రిమెంట్‌ను యాక్సెప్ట్ చేయడం లేదు. అందుకే కమర్షియల్ లూనార్ మైనింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఒక సింగిల్, విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన వ్యవస్థలు (Universally Accepted Systems) ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు.

ఫ్యూచర్‌లో చంద్రునిపై నీళ్లు దొరికితే వాటిని అక్కడే ఆక్సిజన్, హైడ్రోజన్‌గా మార్చి అంతరిక్ష నౌకలకు ఇంధనంగా యూజ్ చేయొచ్చు. చంద్రుని మట్టి నుంచి నిర్మాణ సామాగ్రి తయారు చేయొచ్చు. మినరల్స్, మెటల్స్ ఫ్యూచర్ చంద్రుని కేంద్రాలకు వాడొచ్చు. అంటే మూన్‌ను కేవలం ఒక గమ్యస్థానంగా కాకుండా.. భవిష్యత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకి ఒక ప్రధాన కేంద్రంగా మార్చే ఛాన్స్ ఉంది.

అందుకే ఇప్పుడు కాంపెటీషన్ కూడా మారుతోంది. ఇప్పటికే చంద్రునిపైకి వెళ్లేందుకు ఎన్నో దేశాలు పోటీ పడుతున్నాయి. ఫ్యూచర్‌లో ఎవరు చంద్రునిపై సుస్థిర ఉనికి ఏర్పాటు చేస్తారు? ఎవరు వనరులను ఉపయోగించి టెక్నాలజీ డెవలప్ చేస్తారు? ఎవరు మౌలిక సదుపాయాలు నిర్మాణం చేస్తారు? అనేదే నెక్స్ట్ బిగ్ రేస్‌గా మారుతోంది. అందుకే ట్రంప్ పెట్టిన “The Moon Is Ours” అనే లైన్‌ను ఒక చట్టపరమైన ప్రకటనగా చూడటం కంటే.. చంద్రునిపై అమెరికా చూపిస్తున్న వ్యూహాత్మక ప్రయోజనానికి ఒక నాటకీయ వ్యక్తీకరణగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత అంతర్జాతీయ చట్టం ప్రకారం చంద్రుడు అమెరికాదీ కాదు.. మరే ఒక్క దేశం సొంతం కాదు.

ఇప్పటివరకు మనం చంద్రుడుని ఆకాశంలో కనిపించే ఒక ఉపగ్రహంగా చూశాం. కానీ వచ్చే కొన్ని దశాబ్దాల్లో అదే మూన్.. వాటర్, ఇంధనం, మినరల్స్, పరిశోధన, అంతరిక్ష మౌలిక సదుపాయాల కోసం అత్యంత వాల్యూబుల్ లొకేషన్‌గా మారితే?.. పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అందుకే చంద్రునిపై జరుగుతున్న పరిశోధన ఫలితాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే చంద్రునిపైకి మనుషులను పంపిచేందుకు అమెరికా, రష్యా, చైనా, జపాన్‌తో పాటు ఇండియా కూడా రెడీ అవుతోంది. మరి రాబోయే రోజుల్లో మూన్‌పై ఉండే వనరులు.. ఎవరికి ఎంత సొంతం అవుతాయనేది తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.