US College Admissions : అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ నిర్ణయాలు గుదిబండలా మారాయి. ట్రంప్‌ రెండవసారి అధ్యక్షుడు అయ్యాక తీసుకున్న కఠిన నిర్ణయాలు విదేశీ విద్యార్థులతో పాటు భారతీయ విద్యార్థులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. కఠినంగా మారుతున్న యూఎస్‌ ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా రూల్స్ ప్రభావం అమెరికాలోని యూనివర్సిటీలపై పడుతోంది. దాంతో అమెరికాలో హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్యలో అనూహ్యమైన తగ్గుదల చోటు చేసుకుంది. అమెరికా వలస విధానాలు కఠినతరం చేయడంతో అక్కడి విద్యాసంస్థల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశం కోరే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని ఓ నివేదిక వెల్లడించడం గమనార్హం. అమెరికాలో ఉన్న 1,100లకు పైగా విద్యా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కామన్‌ యాప్‌’ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025-26 విద్యా సంవత్సరంలో యూఎస్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య సుమారు 15 శాతం క్షీణించినట్లు తేలింది.

Also Read : అమెరికాపై కెనడా తీవ్ర ఆగ్రహం.. భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలు

ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల విభాగంలో భారత్ అతిపెద్ద భాగాస్వామ్యాన్ని కలిగి ఉంది. 2024-25 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల కోసం సుమారు 3.63 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో ప్రవేశాలు తీసుకున్నారు. అయితే యూఎస్‌ నిబంధనల కారణంగా కామన్ యాప్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం మొత్తం మీద దరఖాస్తులు పెరిగినప్పటికీ.. మార్చి 1 నాటికి అంతర్జాతీయ దరఖాస్తుదారులు మాత్రం 10 శాతం పడిపోయిందని తేలింది. ఇది రికార్డు స్థాయిలో నమోదైన అత్యంత భారీ క్షీణతగా నిపుణులు పేర్కొంటున్నారు. దీని ప్రకారం 2026 ఫాల్‌ సెమిస్టర్‌ నాటికి అమెరికా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 1.1 లక్షల వరకు తగ్గే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. 2025-26లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 11.69 లక్షలు ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 10.57 లక్షలకు తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా భారత్, చైనాల నుంచి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడంలో అమెరికా అగ్రగామిగా ఉండేది. విద్యార్థులను కోల్పోవడం వలన అమెరికాలో 40,000 ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడతాయని నివేదిక స్పష్టం చేసింది.

కాగా ఈ పరిస్థితికి ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న కఠినమైన విధాన నిర్ణయాలే అని నివేదిక స్పష్టం చేసింది. నాఫ్సా, జెబి ఇంటర్నేషనల్ పరిశోధనా సంస్థ సంయుక్తంగా వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. కఠినమైన వీసా రూల్స్, అనిశ్చిత విధానాల వల్ల ఫాల్ 2026 నాటికి అంతర్జాతీయ విద్యార్థుల రిజిస్ట్రేషన్లు లక్షా 10 వేల వరకు తగ్గే అవకాశం ఉందని తేలింది. గతంలో ఫాల్ 2025-26లో 11లక్షల 69వేలుగా ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల నమోదు.. ఈ ఏడాది భారీగా పడిపోయి 10లక్షల 57వేలకు పరిమితమైందని వెల్లడించింది.

ఈ విధానాల ప్రభావం కేవలం అక్కడి యూనివర్సిటీల మీదనే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా గత విద్యా సంవత్సరంలో స్థానిక ఆర్థిక వ్యవస్థకు సుమారు 42 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరగా, రాబోయే కాలంలో ఇది 38 బిలియన్ డాలర్లకు పడిపోతుందని నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా జూలై నెలలో యూఎస్ ప్రభుత్వం స్టూడెంట్ అండ్ విజిటర్ వీసాలకు సంబంధించి సాంప్రదాయ “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” నిబంధనలను ఎత్తివేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల బస కాలాన్ని సాధారణంగా 4 ఏళ్లకు పరిమితం చేస్తూ కొత్త రూల్స్ తీసుకువచ్చింది.

అది మాత్రమే కాకుండా గ్రాడ్యుయేషన్ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకోవాలనుకునే విదేశీ విద్యార్థులపై లక్ష డాలర్ల భారీ రుసుమును విధించే అంశాన్ని కూడా అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి కఠిన రూల్స్ తో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యకు అమెరికా వెళ్లడానికి వెనుకంజ వేసేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ విధానాలు అంతర్జాతీయ విద్యా రంగాన్ని, ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Also Read : రష్యాలో యూఎస్‌ ‘మిస్టరీ’ విమానం… ఉత్కంఠ రేకెత్తిస్తున్న నిఘా చీఫ్‌ పర్యటన

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.