
Ukraine attack : రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న దాడులు కలవరం సృష్టిస్తున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరింది. పరస్పర దాడులతో రెండు దేశాల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. అయినప్పటికీ రెండు దేశాలు వెనకకు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఉక్రెయిన్ రష్యాపై పెద్ద ఎత్తున దాడికి పాల్పడింది. ఉక్రెయిన్ దళాలు రష్యాపై ఏకంగా వెయ్యికిపైగా డ్రోన్లతో విరుచుకుపడటం కలకలం రేపింది. మాస్కోలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. మాస్కోలోని ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా చేపట్టిన డ్రోన్ దాడితో రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగడంతో పాటు ,దట్టంగా పొగ అలముకుంది. సమీపంలోనూ ఈ దాడులు జరగడంతో అక్కడ పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.డ్రోన్ దాడితో రిఫైనరీలోని కొంత భాగం దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.మాస్కోలోని ఓ అపార్ట్‌మెంట్‌ను కూడా డ్రోన్లు తాకినట్లు తెలిపారు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి దేశ రాజధానిపై ఈ స్థాయిలో గగనతల దాడులు చేపట్టడం ఇదే మొదటిసారని మాస్కో మేయర్ తెలిపారు.ఉక్రెయిన్ దాడులతో రామెన్‌స్కోయే ప్రాంతంలో 400 మందిని అధికారులు ఖాళీ చేయించారు.వీరిలో 70 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో —మాస్కో ప్రాంతంలో ఇద్దరు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. మరో 450 ఉక్రెయిన్ డ్రోన్లను తమ దళాలు కూల్చివేశాయని రష్యా సైన్యం ప్రకటించుకుంది.
ఉక్రెయిన్ ప్రయోగించిన పలు డ్రోన్లు మాస్కోలోని కీలక ఆయిల్ రిఫైనరీలతో పాటు నాలుగు భవనాలను తాకినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు క్రిమియాపైనా కూడా ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది. సైనిక సరఫరాలను, విద్యుత్తు వ్యవస్థల్ని స్తంభింపజేసేందుకే ఈ తాజా దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడుల కారణంగా మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు. దాడులు, విద్యుత్ అంతరాయంతో పలు విమానాలు రద్దుకాగా.. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. రష్యాలో త్వరలో పార్లమెంటరీ ఎన్నికలు నిర్విహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉక్రెయిన్ మాస్కోపై డ్రోన్ల దాడులు తీవ్రం చేయడం గమనార్హం.
కాగా యుద్ధం మొదలైన తర్వాత మాస్కోపై ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి అని పరిశీలకులు భావిస్తున్నారు. దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పలు కీలక విషయాలు వెల్లడించారు. ‘గత రాత్రి మాస్కోలోని అనేక ప్రాంతాలను మా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయన్నారు. ఈ దాడుల్లో రష్యాకు చెందిన ఓ కీలక చమురు కర్మాగారం ధ్వంసమైందని తెలిపారు. ఇందుకుగానూ మా భద్రతా దళాలు, గూఢచార విభాగం, ప్రత్యేక దళాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఇప్పటికైన మాస్కో యుద్ధాన్ని ముగించి.. శాంతిని కోరుకోవాలని, దానికోసం ముందుకు రావాలని కోరుకుంటున్నా’ అని జెలెన్‌స్కీ వెల్లడించారు.









