
UNHRC : గత కొంతకాలంగా ఇరాన్‌పై దాడులు నిర్వహిస్తున్న అగ్రరాజ్యం అమెరికా ఆ దేశంలో అనేక యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ (యూఎన్హెచ్ఆర్సీ) నియమించిన అంతర్జాతీయ నిజనిర్ధారణ బృందం ఈ విషయమై నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇరాన్‌పై అమెరికా జరిపిన రెండు దాడుల్లో అగ్రరాజ్యం యుద్ధ నేరాలకు పాల్పడిందని చెప్పేందుకు తగిన ఆధారాలు లభించాయని నిజనిర్ధారణ బృందం తెలిపింది. ఈ రెండు దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 178 మంది మృతి చెందినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. నిజానికి ఇరాన్ పై అమెరికా అనేక దాడులు చేసినప్పటికీ నిజనిర్ధారణ బృందం రెండు ఘటనలను ప్రస్తావించింది. ఆ రెండు ఘటనల్లో ఒకటి.. మినాబ్‌లోని పాఠశాలపై తోమహాక్ క్షిపణి దాడి చేసిన సందర్భం, మరొకటి లామెర్డ్ నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, నివాస ప్రాంతంపై జరిగిన వైమానిక దాడి. ఈ రెండు దాడుల్లోనూ అమెరికా అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైంది. అదేవిధంగా ఇరాన్లో భద్రతా బలగాలూ తీవ్రమైన మారణకాండకు పాల్పడ్డాయని నిజనిర్ధారణ బృందం ఆరోపించింది.
Also Read : ఇరాన్, అమెరికా యుద్ధంలో కీలక పరిణామం… అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్లో ఒకవైపు, సొంత ప్రభుత్వమే హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుండటం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేస్తుండటం.. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధం.. ఈ రెండింటి మధ్య అక్కడి పౌరులు నలిగిపోతున్నారని ఆ సంస్థ తెలిపింది. కాగా, ఈ నివేదిక ఇరాన్ యుద్ధంలో జరిగిన నేరాల గురించి సేకరించిన అంతర్జాతీయ ఆధారాలను మరింత బలపరిచింది. తద్వారా, అంతర్జాతీయ న్యాయస్థానాలలో న్యాయం సాధించేందుకు ఇది ఉపయోగపడనుంది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన సమయంలో మినాబ్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని ఐఆర్జీసీ స్థావరాలపై అమెరికా దాడులు చేస్తున్న సమయంలో మినాబ్‌లోని ఓ పాఠశాలపై క్షిపణి పడింది. ఈ ఘటనలో 168 మంది మృతి చెందారు. వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మరోవైపు.. లామెర్డ్పై దాడికి తాము బాధ్యులం కాదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇదివరకే ఖండించింది. ఏది ఏమైనప్పటికీ అమెరికా సృష్టించిన ఈ మారణకాండపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
Also Read : భారత్‌పై నూరుశాతం సుంకాలు… రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల బిల్లుకు ఆమోదం..









