
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు డొనాల్డ్ ట్రంప్. ప్రతి ఏడాది ఈ అవార్డు ప్రకటన దగ్గరపడే కొద్దీ ఈసారైనా ట్రంప్‌కు నోబెల్ వస్తుందా? అనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా నడుస్తోంది. గతంలో ఎన్నోసార్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చివరి నిమిషంలో ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. మరి 2026 నామినీల జాబితాలో రేసు గుర్రంగా నిలిచిన ట్రంప్.. ఈసారైనా ఆ బంగారు పతకాన్ని ముద్దాడతారా? అసలు ఆయనకు ఈ అవార్డు దక్కే ఛాన్స్ ఉందా? లేక నోబెల్ కమిటీ మళ్లీ ట్రంప్‌కు షాక్ ఇవ్వనుందా? చూద్దాం.
డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుకునే వారు ప్రధానంగా ఆయన తీసుకొచ్చిన అబ్రహాం ఒప్పందాల’ను ఎత్తిచూపుతున్నారు. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందాలు కుదర్చడంలో ట్రంప్ పోషించిన పాత్రను మెచ్చి కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ దేశాల అగ్ర నాయకులు ఆయన పేరును నోబెల్ కమిటీకి నామినేట్ చేశారు. అయితే ట్రంప్ నోబెల్ బహుమతి రేసులో ఉన్నప్పటికీ ట్రంప్‌కు అవార్డు దక్కడంలో చాలా ఎక్కువే నెగిటివ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఇరాన్‌తో సైనిక ఘర్షణలు, యుద్ధ వాతావరణంలో మునిగిపోవడం అతిపెద్ద మైనస్ పాయింట్‌గా మారింది.
సాధారణంగా ఘర్షణలను పెంచే నాయకులకు నార్వేజియన్ నోబెల్ కమిటీ అస్సలు ప్రాధాన్యత ఇవ్వదు. వీటితో పాటు పారిస్ వాతావరణ ఒప్పందం, వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికాను బయటకు తీసుకురావడం ద్వారా గ్లోబల్ పీస్‌కు విఘాతం కలిగించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. అలాగే గతేడాది ఈ బహుమతి గెలుచుకున్న వెనిజులా నాయకురాలు మరియా కొరినా మచాడో తన నోబెల్ మెడల్‌ను ట్రంప్‌కు కానుకగా ఇచ్చారు. ఈ ఘటన నోబెల్ కమిటీని ఆశ్చర్యానికి పడేసింది. ఇప్పుడు మళ్లీ ట్రంప్‌కు అవార్డు ఇస్తే అది రాజకీయ ఒత్తిళ్లకు తగ్గి ఇచ్చినట్లు అవుతుందని కమిటీ భావిస్తోంది.
ప్రస్తుతం ట్రంప్‌కు నోబెల్ రాకపోవడానికి ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు అని కూడా చెప్పవచ్చు. ఒకవైపు శాంతి బహుమతి రేసులో ఉంటూ మరోవైపు ఇరాన్ లాంటి దేశంతో నేరుగా యుద్ధానికి దిగడం, తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. నార్వేజియన్ నోబెల్ కమిటీ చరిత్రను గమనిస్తే సైనిక చర్యలను లేదా యుద్ధ వాతావరణాన్ని ప్రోత్సహించే ఏ అగ్రనేతకూ ఈ పురస్కారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇరాన్ అంశంలో ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి వల్ల ఆయన నోబెల్ ఆశలు దాదాపు ఆవిరైనట్లే అని నిపుణులు చెబుతున్నారు.
ఈసారి శాంతి బహుమతి రేసులో 287 నామినేషన్లు నమోదయ్యాయి. అయితే 2026 నోబెల్ రేసులో కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ వంటి దేశాల సిఫార్సులతో ట్రంప్ పేరు నామినీల జాబితా వరకు వెళ్లడం ఖాయం. కానీ ఐదుగురు సభ్యులతో కూడిన నార్వేజియన్ నోబెల్ కమిటీ తుది షార్ట్‌లిస్ట్ తయారు చేసే సమయానికి ఆయన పేరు వెనకబడిపోతుంది. అక్టోబర్ 9న ఓస్లోలో ప్రకటించే విజేతల జాబితాలో ట్రంప్ కంటే అంతర్జాతీయ సహకారానికి ప్రతీకగా నిలుస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లేదా మానవ హక్కుల సంస్థలకే అత్యధిక అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈసారి కూడా ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి కలగానే మిగిలిపోయే సూచనలే స్పష్టంగా కనిపిస్తున్నాయి.









