
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెట్టి చాకిరీ ద్వారా తయారైన వస్తువుల దిగుమతులను సరిగ్గా అడ్డుకోవడం లేదనే తీవ్ర ఆరోపణలతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 భాగస్వామ్య దేశాలపై కొత్త పన్నులు విధించారు. వివిధ దేశాల నుంచి తమ దేశానికి వచ్చే దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు సుంకాలను విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇప్పటివరకు తాత్కాలికంగా అమలులో ఉన్న 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ల గడువు ముగియడంతో.. అమెరికా ప్రభుత్వం ట్రేడ్ యాక్ట్ 1974 లోని ‘సెక్షన్ 301’ నిబంధనను ఉపయోగించి ఈ కఠిన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. దీనివల్ల అమెరికాకు ఎగుమతులు చేసే అనేక అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాల వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
Also Read : ప్రపంచాన్ని వణికించే ఏఐ వైరస్.. ఇంకో రెండేళ్లలో ఉద్యోగులకు తప్పని తిప్పలు
ఈ అంతర్జాతీయ టారిఫ్ నిర్ణయంలో భారతదేశానికి మాత్రం ఊరట లభించింది. ప్రారంభంలో భారత్ నుంచి వచ్చే వస్తువులపై కూడా 12.5 శాతం భారీ టారిఫ్ విధించాలని అమెరికా భావించింది. అయితే వెట్టి చాకిరీ నిరోధానికి సంబంధించిన చట్టాలను అమలు చేయడంలో భారత్ చూపిన వేగం, తీసుకున్న కఠిన చర్యలను గుర్తించిన ట్రంప్ యంత్రాంగం, భారత్‌పై వేసే పన్నును 10 శాతానికి తగ్గించింది. దీనివల్ల మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ ఎగుమతిదారులకు కొంత ప్రయోజనం కలగనుంది.
అంతేకాకుండా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన కొన్ని వస్తువులకు ఈ టారిఫ్‌ల నుంచి అమెరికా పూర్తి మినహాయింపు ఇచ్చింది. చమురు, సహజ వాయువు, ఎరువుల దిగుమతులతో పాటు యూఎస్-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే వస్తువులపై ఈ కొత్త పన్నులు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మినహాయింపుల వల్ల గ్లోబల్ ఇంధన మార్కెట్, వ్యవసాయ రంగానికి పెద్ద ఉపశమనం లభించినట్లయింది.
Also Read : పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత.. నౌకలపై హౌతీల దాడి.. ట్రంప్ వార్నింగ్









