
అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండగా.. తాజాగా ఎర్ర సముద్రంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన రెండు ప్రధాన చమురు నౌకలపై క్షిపణులతో దాడులు చేశారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. హూతీలు జరిపిన ఈ దాడులకు ఇరాన్ ప్రభుత్వం మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read : ప్రపంచాన్ని వణికించే ఏఐ వైరస్.. ఇంకో రెండేళ్లలో ఉద్యోగులకు తప్పని తిప్పలు
హూతీ తిరుగుబాటుదారులు ఇరాన్ చెప్పుడు మాటలతో ఈ విధ్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో వాణిజ్య నౌకలపై దాడి చేసినప్పుడు అమెరికా దళాలు హూతీలకు గట్టి బుద్ధి చెప్పాయని.. అప్పటి నుండి వారు కొంతకాలం ఎలాంటి దాడులకు పాల్పడలేదు. ఇప్పుడు మళ్లీ దాడులకు తెగబడటం సరికాదని అన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతమైతే ఇరాన్‌పై నేరుగా బలమైన సైనిక చర్యలు తీసుకుంటామని, టెహ్రాన్ ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
మరోవైపు ఈ ఏడాది జూలై 12న అమెరికా దళాలు ఇరాన్‌పై జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చమురు నౌకలను లక్ష్యంగా చేసుకున్నామని హూతీ రెబెల్స్ బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనడానికి ఇది స్పష్టమైన సంకేతంగా మారింది. హూతీల ఈ ప్రకటనతో ఎర్ర సముద్రంలో నౌకల ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది.
అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్ర మార్గాల్లో సముద్ర రవాణాను కాపాడేందుకు అమెరికా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని ‘యూఎస్ సెంట్రల్ కమాండ్’ వెల్లడించింది. వాణిజ్య నౌకలను, నావికులను భయభ్రాంతులకు గురిచేసి సముద్ర మార్గాలను మూసివేయాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధిపై మళ్లీ పూర్తి స్థాయి పట్టు సాధించి, చమురు రవాణాతో పాటు ఇతర అంతర్జాతీయ నౌకల రాకపోకలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగేలా చర్యలు తీసుకుంటామని అమెరికా సైనిక అధికారులు తెలిపారు.
Also Read : జాబ్ మానేస్తే 22 లక్షలకు.. ఉద్యోగులకు టాప్ కంపెనీ బంపరాఫర్!









