అమెరికా వెళ్లాలనుకునే పర్యాటకులు, వ్యాపారవేత్తలకు యూఎస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. బీ1/బీ2 (B1/B2) తాత్కాలిక సందర్శక వీసాల కోసం ఏకంగా 50 దేశాల పౌరులపై వీసా బాండ్ సమర్పించాలనే కొత్త నిబంధనను విస్తరిస్తూ అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కఠినమైన వీసా బాండ్ జాబితా నుంచి భారత్‌కు పూర్తి మినహాయింపు లభించింది. అయితే మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి దక్షిణాసియా దేశాలతో పాటు ఆఫ్రికా, కరేబియన్, మధ్య ఆసియా, పసిఫిక్ ప్రాంతాలలోని అనేక దేశాలు ఈ నిబంధన పరిధిలోకి వచ్చాయి.

Also Read : ఉక్రెయిన్‌పై ఏఐ మ్యూజిక్ సైకలాజికల్ వార్.. పాటలు పెట్టి చంపేస్తున్న రష్యా

అసలు వీసా బాండ్ అంటే ఏమిటి?

వీసా బాండ్ అనేది ఒక రకమైన భద్రతా డిపాజిట్. తాత్కాలిక వ్యాపారం (B1) లేదా పర్యాటక (B2) వీసాలపై అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులు, తమ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అనధికారికంగా అక్కడే ఉండిపోవడాన్ని అరికట్టడానికి అమెరికా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ జాబితాలో ఉన్న 50 దేశాల పౌరులు అమెరికా వీసా పొందాలంటే నిర్ణీత మొత్తాన్ని బాండ్ రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కాన్సులర్ అధికారి వీసా ఇంటర్వ్యూ సమయంలో ప్రయాణికుడిని బట్టి 10,000 డాలర్లు (సుమారు రూ.8.3 లక్షలు), 15,000 డాలర్లు (సుమారు రూ.12.5 లక్షలు), లేదా 20,000 (సుమారు రూ.16.7 లక్షలు) బాండ్ మొత్తంగా నిర్ణయిస్తారు. ప్రయాణికుడు వీసా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అనుమతించిన గడువులోనే అమెరికా నుంచి తిరిగి తమ సొంత దేశానికి వచ్చేస్తే.. డిపాజిట్ చేసిన బాండ్ సొమ్మును పూర్తిగా తిరిగి ఇచ్చేస్తారు. ఒకవేళ వీసా గడువు ముగిసినా అమెరికాలోనే చట్టవిరుద్ధంగా ఉండిపోతే.. ఆ బాండ్ సొమ్మును అమెరికా ప్రభుత్వం శాశ్వతంగా జప్తు చేసుకుంటుంది.

వీసా బాండ్ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది?

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇచ్చే ఎంట్రీ/ఎగ్జిట్ డేటా ఆధారంగా ఏ దేశాల పౌరులు ఎక్కువగా వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉండిపోతున్నారో ఆయా దేశాలను ఈ 50 దేశాల జాబితాలో చేర్చారు. ఈ నిబంధన వర్తించే దరఖాస్తుదారులు తప్పనిసరిగా DHS ఫారం I-352 సమర్పించాలి. యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఆన్‌లైన్ ప్లాట్‌‌ఫారమ్ ‘Pay.gov’ ద్వారా మాత్రమే ఈ చెల్లింపులు చేయాలి. అయితే కాన్సులర్ అధికారి స్పష్టమైన సూచనలు ఇచ్చేంత వరకు ఎలాంటి ముందస్తు చెల్లింపులు చేయకూడదు. ఈ వీసా బాండ్‌ను దరఖాస్తుదారుడితో పాటు వారి బంధువులు, స్నేహితులు లేదా వ్యాపార భాగస్వాములు కూడా చెల్లించవచ్చు. బాండ్ సమర్పించినంత మాత్రాన వీసా కచ్చితంగా వస్తుందనే గ్యారెంటీ ఉండదు.

అలాగే వీసా బాండ్ సమర్పించి అమెరికాలో ప్రవేశించే ప్రయాణికులకు కొన్ని ప్రత్యేక ఆంక్షలు ఉంటాయి. వారు తప్పనిసరిగా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ప్రీక్లియరెన్స్ సౌకర్యం ఉన్న అధికారిక వాణిజ్య విమానాశ్రయాలను మాత్రమే ఉపయోగించాలి. చార్టర్ విమానాలు, ప్రైవేట్ విమానాలు, రోడ్డు, భూ సరిహద్దులు లేదా సముద్ర ఓడరేవుల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి లేదా వెళ్లడానికి వీలుండదు. బాండ్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ సమాచారాన్ని యూఎస్ పౌరసత్వం, వలస సేవల విభాగానికి నివేదించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Also Read : ‘అవును, ఇన్‌స్టాగ్రాం ఉన్నది గర్ల్స్ కోసమే’ ఎలాన్ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు

భారత్‌‌కు ఎందుకు మినహాయింపు?

భారతదేశం నుంచి ఏటా లక్షలాది మంది పర్యాటకులు, నిపుణులు, వ్యాపారవేత్తలు అమెరికాకు వెళ్తుంటారు. భారతీయ ప్రయాణికుల్లో ఎక్కువమంది వీసా నిబంధనలను, గడువులను సరిగ్గా పాటిస్తారు. ఓవర్‌స్టే రేటు భారతీయుల్లో చాలా తక్కువగా ఉండటంతోనే అమెరికా ప్రభుత్వం భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లను ఈ రూల్ నుంచి మినహాయించింది.