
Melania Trump : అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ గత కొన్ని వారాలుగా ఎక్కడా బయటకు రాకపోవడం, ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చివరిగా జూలై 19న తన భర్త, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో కనిపించారు. ఆ తర్వాత జూలై 24న జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్, జూలై 28న జరిగిన సెనేటర్ లిండ్సే గ్రాహం అంత్యక్రియలు వంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకు కూడా ఆమె హాజరుకాలేదు.
మెలానియా ఈ ఏడాది కేవలం 38 రోజులు మాత్రమే బయటకు రాగా ఇప్పటివరకు 34 కార్యక్రమాలలో పాల్గొన్నారు. ట్రంప్ మొదటి పదవీకాలంతో పోలిస్తే, ఈసారి ఆమె చాలా తక్కువ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే బయట కనిపించడం కంటే పని చేయడం, ఫలితాలు సాధించడమే ఫస్ట్ లేడీకి ము ముఖ్యమని ఆమె సీనియర్ సలహాదారు తెలిపారు. అయితే ట్రంప్ పర్యటనల్లో మెలానియా బదులుగా ఆయన సహాయకురాలు 35 ఏళ్ల నటాలీ హార్ప్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటీవల టర్కీ వెళ్లిన మిలిటరీ విమానంలో కూడా ట్రంప్‌తో పాటు ఉన్న కొద్దిమంది సిబ్బందిలో నటాలీ కూడా ఉన్నారు.
అయితే మెలానియా కనిపించకుండా పోయారనే వార్తలపై ఆమె టీమ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల విడిపోయిన కుటుంబాలను కలిపే ఒక ముఖ్యమైన పనిలో ఆమె బిజీగా ఉన్నారని తెలిపారు. చాలా కాలం తర్వాత ఒక తల్లిని ఆమె బిడ్డతో కలపడం కంటే ముఖ్యమైనది ఏదీ లేదని, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల దూరమైన వారిని వారి కుటుంబాలతో కలపడంపైనే తాను, తన ప్రతినిధులు దృష్టి పెట్టామని మెలానియా స్వయంగా చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మెలానియా శాంతి లేఖ రాసినప్పటి నుండి ఇప్పటివరకు 34 మంది పిల్లలను వారి కుటుంబాలతో సురక్షితంగా కలిపినట్లు ఆమె టీమ్ వెల్లడించింది.









